Anni Manchi Sakunamule: ఈ యేడాది ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి ‘సీతారామం’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే సంస్థ ఈ యేడాది చివరిలోనూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వీడ్కోలు పలుకబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
‘ఏక్ మిని కథ’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో సంతోష్ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్స్ ను నిర్మించిన స్వప్న సినిమాస్ కాంబినేషన్‌లో ఈ కుటుంబ కథా చిత్రం రానుంది. ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలోని క్లాసిక్ సాంగ్ ‘అన్నీ మంచి శకునములే’ నుంచి ఈ సినిమా టైటిల్‌ను తీసుకున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దావూద్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాశారు. సన్నీ కొర్రపాటి ఛాయగ్రాహకుడు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.