టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును అడ్డం పెట్టుకుని తనను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమాజంలో స్వతంత్రంగా ఉండే మహిళలను భయంతో నియంత్రించాలని చూసే వారే ఇలాంటి పితృస్వామ్య అహంకారంతో ప్రవర్తిస్తారని మండిపడ్డారు.
Also Read:Vrushabha Review: వృషభ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
గత తరాలు నేర్చుకున్న తప్పుడు పద్ధతులు లేదా పాతకాలపు ఆలోచనలను మనం అలాగే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆమె హితవు పలికారు. మనం మార్పును ఎంచుకోవాలని, ఒకరికొకరం అండగా నిలవాలని కోరారు. ఇలాంటి వివాదాలను Glorification చేస్తూ చూపిస్తున్న కొన్ని మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా, తనను ఎంతమంది టార్గెట్ చేసినా తాను ఏమాత్రం ప్రభావితం కానని, ధైర్యంగా నిలబడతానని అనసూయ స్పష్టం చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న ఒక వర్గం తరపున మాట్లాడటమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ప్రధాన సమస్యను వదిలేసి తనను ‘ఆంటీ’ అని పిలుస్తున్న వారిపై ఆమె సెటైర్లు వేశారు. “నాకు 40 ఏళ్లు.. ఆయనకు (శివాజీకి) 54 ఏళ్లు అనుకుంటా. మేమిద్దరం మా వృత్తి కోసం ఫిట్‌నెస్‌ను, గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్నాం. కానీ నన్ను ఆంటీ అంటున్న వారు ఆయన్ని మాత్రం ‘గారు’ అని పిలుస్తున్నారు. ఇందులో ఉన్న హిపోక్రసీ ఏంటో అర్థం కావడం లేదు” అని ఎద్దేవా చేశారు. చివరగా “ఆప్ జలన్ బర్కరార్ రఖ్నా.. హమ్ జల్వా బర్కరార్ రఖేంగే” (మీ కుళ్లును మీరు అలాగే ఉంచండి.. నా జల్వా నేను చూపిస్తూనే ఉంటాను) అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని ముగించారు.