మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన రాజా చిత్రం వృషభ. నిజానికి ఛాంపియన్ సినిమాలో హీరోగా నటించిన రోషన్ ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాలి కానీ కొన్ని డేట్స్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. తెలుగువారికి ఈ మధ్యకాలంలో బాగా దగ్గరైన హీరోయిన్ నయన్ సారిక హీరోయిన్ గా మరో కొత్త నటుడు సమర్జిత్ హీరోగా ఈ సినిమాలో నటించారు. అలాగే మా కన్నడ నటి రాగిణి ద్వివేది, గరుడ రామ్ అజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. బన్నీ వాసు సమర్పణలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
వృషభ కథ:
జన్మజన్మాంతరాలుగా వెంటాడే పగ, ప్రతీకారం, మోక్షం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక శివభక్తుడైన వృషభ వంశ రాజు(మోహన్ లాల్) తన అజ్ఞానం వల్ల చేసిన తప్పు కారణంగా శాపానికి గురవుతాడు. ఆ శాపం ఏమిటంటే.. అతని పుత్రుడే అతనికి మృత్యువుగా మారుతాడు. ఆ శాపం నుండి తన కొడుకుని, తన వంశాన్ని కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసే పోరాటమే ‘వృషభ’. గత జన్మలోని ఈ కథకు ప్రస్తుత కాలంలో ఒక బిజినెస్ టైకూన్ కుటుంబానికి సంబంధం ఏమిటి? గత జన్మ పాపాలకు ఈ జన్మలో పరిహారం దొరికిందా లేదా? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
విశ్లేషణ:
నిజానికి పునర్జన్మల నేపథ్యంలో కథలు మనకి కొత్త ఏం కాదు ఈ సినిమా కథ కూడా పునర్జన్మల నేపథ్యంలోనే రాసుకున్నారు. సినిమా ప్రారంభంలోనే వృషభరాజవంశం గురించి కూలంకషంగా చర్చించిన దర్శకుడు నందకిషోర్ ఆ తరువాత ప్రస్తుత జన్మలోకి తీసుకొచ్చాడు. వాస్తవానికి జన్మజన్మలకు వెంటాడే వెంటాడే పగ అనే పాయింట్ తో ఈ కథ రాసుకున్నట్టు అనిపించింది కానీ దాని తెరమీదకి తీసుకురావడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో తడబడ్డాడు. కథపరంగా రొటీన్ అయినా సరే కథనంతో సినిమాని బాగా నడిపించి ఉండనచ్చు కానీ ఎందుకు ఆ విషయం మీద కూడా దర్శకుడు పూర్తిస్థాయిలో ఫోకస్ చేయలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు నంద కిషోర్ ఈ కథను ఒక హారర్ లేదా ఫాంటసీగా కాకుండా, బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌తో నడిపించాలని ప్రయత్నం చేశాడు కానీ అది కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. రామాయణం, రాజా హరిశ్చంద్ర వంటి పురాణ గాథల స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగులో వచ్చే భారీ హిస్టారికల్ సినిమాల మాదిరిగానే ఇందులో కూడా యాక్షన్, గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ, వాటి కంటే ఎక్కువగా ఎమోషన్స్ మీద దర్శకుడు నమ్మకం పెట్టుకున్నాడు కానీ అవి కూడా వర్క్ అవుట్ కాలేదు. సినిమా ప్రారంభం కొంచెం నెమ్మదిగా అనిపించినా, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథకు మంచి ఊపునిస్తుంది. సెకండ్ హాఫ్ మొదటి భాగం కంటే చాలా గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, కథనంలో రొటీన్ ట్రీట్మెంట్ కారణంగా సినిమా కొత్తగా కనెక్ట్ అయ్యే అవకాశాలు లేవు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు మోహన్ లాల్ ప్రధాన బలం. ఎమోషనల్ సీన్లలో ఆయన నటన అద్భుతం. ఒక తండ్రిగా ఆయన పండించిన వేదన, యాక్షన్ సీన్లలో ఆయన చూపిన గ్రేస్ లాల్ అభిమానులకు కన్నుల పండుగే. ఇక కన్నడ యువ నటుడు సమర్జిత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. మోహన్ లాల్ వంటి దిగ్గజ నటుడితో పోటీ పడి నటించే క్రమంలో తడబడకుండా ఆకట్టుకున్నాడు. రాగిణి ద్వివేది, నేహా సక్సేనా తమ పరిధి మేరకు నటించారు. వెటరన్ యాక్టర్ జితేంద్ర గెస్ట్ అప్పీరెన్స్ సినిమాకు ఒక ప్రత్యేకతను తెచ్చింది. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఆంటోనీ సామ్సన్ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. హిస్టారికల్ మరియు మోడ్రన్ కాలాలను చూపడంలో కెమెరా పనితనం బాగుంది. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ఒక మైనస్ పాయింట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించిన గ్రాఫిక్స్ కొన్ని చోట్ల సహజంగా లేవు. టెక్నాలజీని ఇంకాస్త మెరుగ్గా వాడుకుని ఉంటే బెటర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ వచ్చేవేమో.
చివరిగా: ‘వృషభ’ మిస్సయిన జానపద ప్రయోగం