హీరో ‘అల్లరి’ నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం ఘన విజయం సాధించింది. అంతేకాదు… ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు హిందీలోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేశ్, విజయ్ కనకమేడల కాంబోలో సెకండ్ మూవీగా ‘ఉగ్రం’ తెరకెక్కనుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది. ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఫెరోషియస్ గా కనిపించాడు. ఇక తాజా విషయానికి వస్తే… ఈ మూవీలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’తో పాటు, తమిళంలో మూడు చిత్రాలలో మిర్నా నటించింది. అంతేకాదు… తెలుగులోనూ ఆదిసాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. తన తొలి టాలీవుడ్ మూవీ రిలీజ్ కాకుండా రెండో సినిమా ఛాన్స్ దక్కించుకుంది మిర్నా మీనన్.
‘కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్’ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 5గా ‘ఉగ్రం’ నిర్మితమౌతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. దీనికి తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.