Adivi Sesh: యంగ్ హీరో అడవి శేష్ ఇప్పటికీ ఎలిజిబుల్ బ్యాచిలరే! అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఎంతో మంది ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ పెళ్ళి గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి… ఇంకా టైమ్ ఉంది… కెరీర్ ముఖ్యం అంటూ శేష్ దాటవేస్తూ వస్తున్నాడు. ‘మేజర్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శేష్ కు గత యేడాది ‘హిట్ 2’ రూపంలో సెకండ్ సక్సెస్ కూడా దక్కింది. విశేషం ఏమంటే… ఇప్పుడు అతని ఇంటిలో పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఆగండాగండి… ఇవి శేష్ పెళ్ళి సందర్భంగా మోగుతున్న బాజాలు కావు. అతని చెల్లెలు షెర్లీ పెళ్ళి కారణంగా మోగుతున్నాయి. అడివిశేష్ తండ్రి చంద్ర ఆంధ్ర యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించి, ఆ పైన అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఆయన కుమారుడు శేష్ చిత్ర సీమలోకి అడుగుపెడితే, అతని చెల్లెలు షెర్లీ డాక్టర్ చదివింది. ఈ నెల 26న ఆమె వివాహం అమెరికాకు చెందిన డేవిన్ గుడ్రిచ్ తో జరుగబోతోంది. పెళ్ళి వేడుకలన్నీ హైదరాబాద్ అవుట్ కట్స్ లో ప్లాన్ చేశారు. ఈ వివాహం కోసం వరుడి కుటుంబ సభ్యులు ఫ్లోరిడా నుండి హైదరాబాద్ కు వచ్చారు. తన చెల్లి వివాహానికి సంబంధించిన హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అడివి శేష్ మీడియాకు విడుదల చేశాడు. కేవలం వందమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరుపుతున్నట్టు సమాచారం. విశేషం ఏమంటే… ఈ వివాహ తంతు మొత్తం హిందూ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సాగుతోంది.