నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు.
అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది మాత్రం అమెరికాలోని బర్క్ లీలో. అక్కడే విద్యాభ్యాసం సాగించాడు శేష్. అతని సమీపబంధువు సాయికిరణ్ అడివి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో అడివి శేష్ లోనూ నటనాభిలాష కలిగింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మల్లెపువ్వు’ అనే సినిమాలో నటించడానికి వచ్చాడు శేష్. ఎందుకనో ఆ సినిమా ముందుకు సాగలేదు. శేష్ సినిమా రంగానికి పనికి రాడని అన్నారు. ఆ మాటతో అతనిలో పట్టుదల పెరిగింది. ఆ తపనతోనే సినిమా పరిజ్ఞానం, ఫిలిమ్ మేకింగ్ లో మెలకువలు, నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘సొంతం’ వంటి కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించాడు శేష్. పవన్ కళ్యాణ్ ‘పంజా’లో గుర్తింపు ఉన్న పాత్రలో నటించాడు. తరువాత “బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్”లో కనిపించాడు. ‘బాహుబలి- ద బిగినింగ్’లో ఓ కీలక పాత్రలో నటించి, మరింత గుర్తింపు సంపాదించాడు శేష్.
“క్షణం, ఊపిరి, అమీ తుమీ, గూఢచారి, ఓ బేబీ, ఎవరు” చిత్రాలలో కీ రోల్స్ లోనూ, హీరోగానూ కనిపించాడు శేష్. ‘గూఢచారి, ఎవరు’ చిత్రాలు శేష్ కు హీరోగా మంచి మార్కులు సంపాదించి పెట్టాయి. “కర్మ, కిస్” చిత్రాలకు దర్శకత్వం వహించాడు శేష్. వీటితో పాటు “క్షణం, గూఢచారి, మేజర్” సినిమాలకు కథలు కూడా అందించాడు. మహేశ్ బాబు నిర్మించిన ‘మేజర్’ చిత్రంలో హీరోగా నటించాడు శేష్. త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రానుంది. ఈ బర్త్ డే తరువాత అడివి శేష్ మరింతగా స్పీడు పెంచే అవకాశం ఉంది. ఏ యే సినిమాలతో శేష్ జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.