సాధ్యమైన పని ఎవడైనా చేస్తాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే హీరోల పని! అదీ హాలీవుడ్ యాక్షన్ హీరోలకైతే ఇంపాజిబుల్ అంటే మరింత సరదా! అయితే, అమెరికాలో ఎన్ని అద్భుత చిత్రాలు తెరకెక్కినా మనం బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ గురించే మాట్లాడుకుంటాం. అటువంటి ఓ ఏజెంట్ అగ్రరాజ్యానికి హాలీవుడ్ లో లేడనే చెప్పాలి. కానీ, సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఆ లోటు తీర్చాడు… ఎథాన్ హంట్!
ఎథాన్ హంట్ అనేది ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీలో టామ్ క్రుయిజ్ క్యారెక్టర్ పేరు. 1996, మే 22న చిత్రం విడుదలైంది. అప్పట్నుంచీ ఈ ‘ఇంపాజిబుల్ మిషన్స్ ఫోర్స్’ (ఐఎంఎఫ్) ఏజెంట్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఎలాగైతే జేమ్స్ బాండ్ తన ప్రతీ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తాడో ఈ హాలీవుడ్ హ్యాండ్సమ్ ఏజెంట్ కూడా రెప్పవాల్చనీయని విన్యాసాలు చేస్తాడు. ఇప్పటి వరకూ మొత్తం 6 సార్లు టామ్ క్రుయిజ్ ఎథాన్ హంట్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలతో జనం ముందుకొచ్చాడు. ప్రతీసారి అంతకంటే ముందటి తన స్టంట్స్ ను మించిపోయేలా సరికొత్త సాహసాలు చేస్తూ వస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ఇంకా సెట్స్ పై ఉంది. వచ్చే సంవత్సరం ఏదో ఒక సమయంలో విడుదల కావచ్చు!
‘మిషన్ ఇంపాజిబుల్’ పాతికేళ్ల కింద విడుదలైన ఒకానొక హాలీవుడ్ యాక్షన్ మూవీ అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే, అది అప్పటిదాకా ఉన్న అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూల్స్ ని తిరగ రాసింది. ‘మిషన్ ఇంపాజిబుల్’లో దర్శకుడు బ్రియాన్ డీ పాల్మా అత్యంత సహజంగా సాహస విన్యాసాలు చేయిస్తాడు. హాలీవుడ్ మూవీస్ లో మనకు రెగ్యులర్ గా కనిపించే అన్ న్యాచురల్ ఛేజింగ్ లు, ట్విస్టులు ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లో మనకు కనిపించవు. 1996లో విడుదలైన మొదటి చిత్రంలోనే హీరో క్లైమాక్స్ లో అదరగొట్టేస్తాడు. బైక్, కార్ లాంటి ఏ వాహనం లేకుండా ఓ సన్నటి తాడుకు వేలాడుతూ టామ్ క్రుయిజ్ ఊపిరిబిగబట్టేలా స్టంట్ చేస్తాడు. సీఐఏ బిల్డింగ్ లోకి చోరబడతాడు. ఒక ఫైల్ తీసుకుని సక్సెస్ ఫుల్ గా తిరిగి వస్తాడు. సీన్ గా చెప్పుకుంటే ఇది సాదాసీదాగా ఉంటుంది. కానీ, దర్శకుడి ప్రతిభ, హీరో సాహసంతో ‘మిషన్ ఇంపాజిబుల్’ 25 ఏళ్ల కిందే బాక్సాఫీస్ వద్ద దుమారం రేపింది!
‘మిషన్ ఇంపాజిబుల్’ ఎంతగా సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజ్ అంటే ఇప్పటికి ఆరు చిత్రాలు వచ్చాయి. ఏడోది రూపొందుతోంది. అయినా దర్శకుడు, హీరో, చివరకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా మారలేదు. ప్రతీసారి కొత్త సీక్వెల్ వచ్చినప్పుడల్లా కలెక్షన్లు పెరుగుతున్నాయి. దర్శకుడు అందించే థ్రిల్ పెరుగుతోంది. హీరో టామ్ క్రుయిజ్ డేర్ డెవిల్ స్టంట్స్ కూడా ‘వామ్మో’ అనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నిటికి కారణమైన ఫస్ట్ ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. మే 22న ప్రపంచ వ్యాప్తంగా సొషల్ మీడియాలో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంఛైజ్ లవ్వర్స్ ఐకానిక్ మూవీని గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు!