సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా జరుపుకొంటారు. ప్రతి ఒక్కరూ పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి ధాన్యలక్ష్మిని తలచుకుంటూ సంబరపడిపోతారు. మకర సంక్రాంతిని వివిధ పేర్లతో పిలిచినా అందరిలోనూ పండిన పంట సంబురమే కనిపిస్తుంది. అయితే.. ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. అదే గాలిపటాలు ఎగరేయడం.
జాగ్రత్తలు తప్పని సరి..
అయితే.. గాలి పటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో ఏటా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ సారి గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. గాలిపటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్, చేతికి గ్లౌజ్ వంటివి ధరించాలి. దీని వల్ల దారంతో చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం జరిగితే, గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజితో కట్టేసి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు. పతంగులు ఎత్తుగా ఎగరాలని చాలా మంది సమీపంలోని మిద్దెలు, ఎతైన గోడలపైకి ఎక్కుతారు.
విద్యుత్తుతో జాగ్రత్తా..
ఇలా ఎక్కి గాలిపటాలను వదిలే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడే అవకాశం ఉంది. ఒకవేళ కిందపడి దెబ్బలు తగిలిన చోట మసాజ్ చేయకూడదు. రక్తస్రావం ఉన్న చోట బ్యాండేజిని వదులుగా చుట్టాలి. గాయాలైన చోట పసుపు కూడా అద్దకూడదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. ప్రధానంగా విద్యుత్‌లైన్లు తగిలిన దానిని కర్రలు, గడలతో లాగేందుకు ప్రయత్నం చేయరాదు. దీనివల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగనట్లయితే సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయలో తెలుపాలి.