Omicron Subvariant BF.7 Symptoms: చైనాలో అల్లకల్లోలానికి దారి తీస్తోంది ఓమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని కూడా చైనా ప్రభుత్వం ఎత్తేయడంతో రానున్న మూడు నెలల్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని.. జనాభాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు.
వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్-7:
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్ ఈ బీఎఫ్-7. అంతకు ముందు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.2. బీఏ.5 వేరియంట్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటితో పోలిస్తే బీఎఫ్-7 వేరియంట్ అనూహ్య రీతిలో వ్యాపిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఇన్ఫెక్షన్ కు గురిచేస్తోంది. తక్కువ పొదిగే కాలం(ఇంక్యూబేషన్ పిరియడ్), ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందడంతో చైనాలో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. టీకా వేసుకున్నవారికి కూడా ఈ బీఎఫ్-7 సోకుతోంది.
Read Also: Police Constable Crime: వివాహితని మోసం చేసిన కానిస్టేబుల్.. పెళ్లి కాలేదని చెప్పి..
ఒమిక్రాన్ బీఎఫ్-7 లక్షణాలు ఇవే..
ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం ముఖ్యంగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు జ్వరం, దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం, అలసట లక్షణాలు ఉంటాయి. కొంత మంది వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల లాగే.. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.
ముఖ్యంగా దీర్ఘాకాలిక వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీఎఫ్-7 ఇతర వేరియంట్లతో పోలిస్తే బలంగా ఉంది. వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన వ్యాధినిరోధక శక్తిని కూడా సవాల్ చేస్తూ.. శరీరంలోకి ప్రవేశించి కోవిడ్ వ్యాధికి కారణం అవుతోంది.