మన దేశంలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు. టీ తాగడం అనేది వారి దినచర్యలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఇంటికి బంధువులు వస్తే టీ ,స్నేహితులు కలిస్తే టీ , ఏదైనా టెన్షన్ లో ఉంటే టీ , చివరికి తలనొప్పి వచ్చినా టీ ఏ తాగుతాము. ఇంతలా ఇష్టపడే టీ ని తరుచుగా తాగడం వల్ల ప్రమాదకరమని చెపుతుంటారు కొందరు. ఎందుకంటే ఇందులో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అయితే చాలామంది నిపుణులు మాత్రం టీ సరైన మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని చెపుతున్నారు. ప్రతిరోజూ కొన్ని కప్పుల టీ తాగడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాల కోసం ఏ రకమైన టీ ని ఎంచుకుంటే మన హృదయానికి మేలు జరుగుతుందో అని కొన్ని మనకు మేలు చేసే టీ రకాల గురించి తెలుసుకుందాం…
1. బ్లాక్ టీ
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ టీలో, కాఫీలో సగం కెఫిన్ ఉంటుంది. రోజూ 2-3 కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గి , కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపడుతుంది.
2. గ్రీన్ టీ
కార్డియాలజిస్టుల ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లు లేకుండా 3-4 కప్పుల గ్రీన్ టీని త్రాగటం మంచిది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇది గుండెకు చాలా మంచిది.
3. వైట్ టీ
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైట్ టీ స్వచ్ఛమైన టీ. గుండె కు ఇది చాలా మంచిది. వైట్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు ధమనులను విస్తరిస్తాయి. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
4. ఊలాంగ్ టీ
ఈ టీని చూర్ణం చేసి ఆక్సీకరణం చెందిన టీ ఆకులను వేడి చేసి దాని ద్వారా తయారు చేస్తారు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.
5. చమోమిలే టీ
గుండె ఆరోగ్యానికి మంచిదని భావించే మరొక హెర్బల్ టీ చమోమిలే టీ. ఇది గుండె రోగులకు తగినంత నిద్రని , శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.