Late Night Sleep Problems: మీకు తెలుసా ఒకప్పుడు చాలా మంది రాత్రి 8 గంటల లోపు నిద్రపోయే వారని. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవడం, హాయిగా చదువుకోవడం, సాయంత్రమైతే ఆటలు, పాటలు, రాత్రి త్వరగా నిద్ర ఇవన్నీ ఒకప్పుడు ఉండేవని ఇంత త్వరగా ఈ రోజుల్లోని పిల్లలకు చెప్పాల్సి రావడం నిజంగా దారుణమే. కానీ ప్రస్తుతం స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన పోటీ, ఒత్తిడి, ఆడుకునే సమయం కూడా లేకపోవడం, రాత్రి ఎప్పుడు నిద్రపోతామో, ఏ సమయానికి నిద్రలేస్తామో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొన్నాయి. ఇవన్నీ కలిసి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సిక్నెస్ అంటే ఏంటో తెలుసా, సరైన నిద్ర లేకపోవడం, లేట్ నైట్ నిద్రలతో యువతకు పొంచి ఉన్న ముప్పు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Teja Sajja: ఓ పెద్ద డైరెక్టర్ నన్ను 15 రోజులు వాడుకుని హ్యాండ్ ఇచ్చారు!
సరైన నిద్ర లేకపోవడం, లేట్ నైట్ నిద్రలతో సర్కేడియన్ రిథమ్ అస్థవ్యస్థమై రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, శరీరం చురుకుదనాన్ని కోల్పోతుందంటున్నారు. ఈ పరిస్థితిని డిలేడ్ స్లిప్ ఫేజ్ సిండ్రోమ్ (DSPS) లేదా మార్నింగ్ సిక్నెస్ అంటారని పేర్కొన్నారు. ఈ సిక్నెస్కు కారణాలు, దీని వల్ల ఎలాంటి తీవ్ర ప్రభావాలు ఉంటాయో చూద్దామా..
ఈ రోజుల్లో కొంతమంది అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, స్క్రీన్ చూడటంతో ఎడతెగని ఆలోచనలు చుట్టుముట్టి ఓ పట్టాన నిద్ర పట్టడం లేదని పలు అధ్యాయనాలు పేర్కొన్నాయి. రోజుకు 6 గంటలు మించి అధిక ఫ్రీక్వెన్సీ రేటు, స్క్రీన్ వాడే వారిలో నిద్ర నాణ్యత తక్కువగా ఉండటం, అలసట, పగటిపూట నిద్రపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలను కనిపిస్తున్నట్లు National Library of Medicine అధ్యయనంలో వెలుగుచూసింది. చిన్న వయసులో నిద్రలేమి ఎక్కువగా ఉన్నవారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని, నిద్రలేమితో మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. వీటన్నింటి కారణంగా భావోద్వేగాల నియంత్రణ పట్టుతప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
చికిత్సల వరకూ వెళ్తుంది జాగ్రత్త..
నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు హాయిగా నిద్రపోవడమే మేలని, లేదంటే అది చికిత్సల వరకూ వెళుతుందంటున్నారు డాక్టర్లు. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవడం అలవాటు చేసుకోవాలని, పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రికల్ డివైజ్‌లను పక్కన పెట్టాలని చెబుతున్నారు. వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతో పాటు ధ్యానం, యోగా, ప్రాణాయామాలతో కంటి నిండా నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.
తప్పనిసరిగా సూర్యరశ్మి..
శరీరానికి తప్పనిసరిగా సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలని, ఉదయం పూట ఒంటికి ఎండ తగిలినవారికి మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ హార్మోన్‌తో ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుందని పేర్కొన్నాయి. ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులో సెరటోనిన్ హార్మోన్ విడుదలవుతుందని, ఫలితంగా ఆనందం, సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయులు పెరుగుతాయని, మనసు ఉల్లాస భరితమవుతుందని నిపుణులు వివరించారు. వీటి కారణంగా మనిషిలో ఆందోళన, ఉద్రిక్తత తగ్గి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, దీంతో ప్రశాంతంగా నిద్రపోవచ్చని తెలిపారు.
దీర్ఘకాలంలో చాలా నష్టం..
నిద్రలేమి, నిద్ర రుగ్మతలు యువకులుగా ఉన్నప్పుడు ప్రభావం పైకి కనిపించకున్నా, దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి సంచిత ప్రభావాలు రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, నిరాశ, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచడంతో సహా విస్తృత శ్రేణి హానికరమైన ఆరోగ్య పరిణామాలతో ముడిపడి ఉన్నాయని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. అమెరికాలో మూడింట ఒక వంతు పెద్దవారు ‘మెటబాలిక్ సిండ్రోమ్’ బారినపడినట్లుగా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. భారత్‌లోనూ ఈ తరహా బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగడం అని నివేదికలు పేర్కొన్నాయి. రాత్రిపూట కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తక్కువగా తిన్నా కూడా నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపాయి.
READ ALSO: Vani Inspiring Story: ‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..