Woman Survives 90-Minute Crocodile Attack In Indonesia: మొసలి ఎంత ప్రమాదకరమైన జీవో అందరికీ తెలుసు. ఒక్కసారి దానికి చిక్కితే, ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. దాని బారి నుంచి బతికి బయటపడటం దాదాపు అసాధ్యమే. అయితే.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ మహిళ. మొసలి నోటికి చిక్కిన ఆమె.. దాదాపు 90 నిమిషాల పాటు దాంతో పోరాడి, చివరికి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 38 ఏళ్ల ఫమ్లిరా డీ జీసస్ అనే మహిళ ఓ పామ్ ఆయిల్ తోటలో పని చేస్తోంది. నీళ్ల కోసం ఆ తోట పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లింది. అయితే.. ఆ చెరువు మొత్తం కలుపు మొక్కలతో కప్పబడి ఉంది. దీంతో.. ఆ మొక్కల మధ్య దాగి ఉన్న మొసలిని ఆమె గమనించలేకపోయింది. నీళ్లు తీసుకోవడానికి ఆ నది అంచున చేరుకోగానే.. మొసలి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమె కాళ్లను నోటితో పట్టుకొని, నీటిలోకి లాక్కెళ్లిపోయింది.
Woman Stuck In Lift: పాపం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని, మూడు రోజులు నరకయాతన అనుభవించి..
ఇతర కూలీలు ఇది గమనించి, ఆమెను కాపాడేందుకు వెంటనే పరుగులు తీశారు. మొసలిని కర్రతో కొట్టి, ఆమెని దాని బారి నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. అటు, ఆ మహిళ సైతం మొసలి నోటీ నుంచి బయటకొచ్చేందుకు గట్టిగానే పోరాడింది. ఇలా దాదాపు 90 నిమిషాల పాటు వాళ్లు ప్రయత్నించారు. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య.. ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ఆమె పాదాలు, ఉదర భాగాలు బాగా దెబ్బతిన్నాయి. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వారికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఫమ్లిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాను మొసలి బారి నుంచి బయటపడతానని అనుకోలేదని, ఇప్పటికీ ఆ మొసలి తన కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తోందని ఆ మహిళ పేర్కొంది.