భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్, యూఏఈ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ఈ భేటీకి హాజరుకానున్నారు. వచ్చే నెల 13 నుంచి 16 వరకు జో బైడెన్ ఇజ్రాయిల్ తో పాటు పశ్చిమాసియా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సమయంలో ఐ2యూ2 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
2021లో అక్టోబర్ లో విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఐ2యూ2 ని ప్రారంభించాలని ప్రతిపాదించాడు. మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాలో ఆర్థిక, రాజకీయ సహకారాన్ని విస్తరించడం, వాణిజ్యం, వాతావరణ మార్పును ఎదుర్కొనడం, ఇంధన సహకారం, ఇతర కీలకమైన అంశాల్లో సమన్వయంతో పనిచేయడానికి ఈ గ్రూప్ ఏర్పడిండి.
బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో వివిధ దేశాలతో సహకార సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యూఎస్ఏ సభ్యులుగా ఉన్న క్వాడ్ మీటింగ్ జరిగింది. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లతో అకూస్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేశాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలా కూటముల నుంచి వైదొలిగాడు. అయితే ప్రస్తుతం వాటన్నింటిని బైడెన్ పునరుద్ధరించే పనిలో ఉన్నాడు.