Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా, అమెరికాలు మందలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ముందు 5 డిమాండ్ల ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం.. పాక్ ప్రధానితో సహా ముఖ్యమైన అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సౌదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, ఇరాన్, చైనా, ఇజ్రాయిల్, ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ ముందు 5 డిమాండ్లు పెట్టారు.
ఇజ్రాయిల్‌ని గుర్తించాలి:
పాకిస్తాన్, ఇజ్రాయిల్‌ని ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే, ఇప్పుడు పాక్ ఇజ్రాయిల్‌ని గుర్తించాలని అమెరికా కోరుతోంది. ట్రంప్ పరిపాలన పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజానికి, సౌదీ అరేబియా లాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ గుర్తింపు ఒప్పందం చేసుకుంటే, పాక్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా మంచి వ్యూహాత్మక, సైనిక సంబంధాలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా వారి సౌదీ ప్రతిరూపాలతో కలిసి సైనిక చర్యలో పాల్గొంటుంది. ఈ ఆపరేషన్‌కు మాజీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ నాయకత్వం వహించారు.
ఇరాన్‌లో అధికార మార్పులకు కుట్ర..
ఇరాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్‌లో అమెరికా, సౌదీ కలిసి ఏదైనా పరిపాలన మార్పును ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని యూఎస్, సౌదీ రెండూ ఆశిస్తున్నాయి.
ఇక చైనా విషయంలో పాకిస్తాన్ తన మిత్రదేశానికి దగ్గరగా ఉండొద్దని అమెరికా సూచించినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ ఉగ్రవాదంపై మందలింపు:
కాశ్మీర్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌ని సౌదీ, యూఎస్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్‌ని ఇరుదేశాలు కోరాయి. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని పాకిస్తాన్‌కి చెప్పినట్లు సమాచారం.
ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై ట్రావెల్ బ్యాన్‌తో సహా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు సాయం చేయాలని అమెరికా కోరింది.