ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రమాదకరమైన అమెరికాకు చెందిన బీ-2 బాంబర్ విమానాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి. ప్రస్తుతం ఇలాంటివి అమెరికా దగ్గర 20 ఉన్నాయి. వీటిలో ఆరు విమానాలను ఇండో-పసిఫిక్‌కు తరలించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Trump: చైనా ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటిస్తుండగానే.. ఇంకోవైపు చడిచప్పుడు లేకుండా హిందూ మహాసముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపు చేసేసింది. హిందూ మహా సముద్రంలో మునుపెన్నడూ లేనంతగా అత్యంత ప్రమాదకరమైన B-2 బాంబర్లు మోహరించాలని పెంటగాన్ ఆదేశించింది. అమెరికా-బ్రిటన్ సంయుక్త హిందూ మహాసముద్ర సైనిక స్థావరమైన డియెగో గార్సియాలోని రన్‌వేపై ఆరు B-2 స్టెల్త్ బాంబర్లు నిలిపి ఉంచిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విమాన వాహన నౌకలను ఒకటి నుంచి మూడుకు పెంచాలని ఆమెరికా ఆదేశించింది. హిందూ మహా సముద్రంలో రెండు, పశ్చిమ పసిఫిక్‌లో ఒకటి ఉండేలా ఆదేశించింది. ఇది దక్షిణ చైనా సముద్ర సమీపంలో ఉంటుంది. ఇక ఈ చర్యను అమెరికా, మిత్రదేశాలు సమర్థించుకుంటున్నాయి. కేవలం ప్రాంతీయ భద్రత కోసమే ఈ మోహరింపు అన్నట్లుగా పెంటగాన్ సమర్థించుకుంటోంది.
ఇది కూడా చదవండి: AP Deputy CM: నేడు భద్రాచలం వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇజ్రాయెల్‌కు మొదటి నుంచి అమెరికా మద్దతుగా నిలిచింది. అయితే ఈ చర్యను పశ్చిమాసియా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక యెమెన్‌కు చెందిన హౌతీలకు ఇరాన్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థను ఇరానే వెనుకుండి నడిపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంపై అమెరికా వ్యాపారాలు, సైనిక నౌకలను లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా హౌతీలు టార్గెట్‌గా అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అయినా కూడా హౌతీలు రెచ్చిపోతూనే ఉన్నారు. మరోవైపు అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అత్యంత ప్రమాదకరమైన బాంబులను ప్రయోగిస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రంలో, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో B-2 బాంబర్ విమానాలు మోహరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదొక సమయంలో భీకర దాడులు జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.