Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి గురించి గాజా జర్నలిస్టులకు ముందే తెలుసా..?
వివరాల్లోకి వెళ్తే యూకేకి చెందిన 42 ఏళ్ల వ్యక్తి జాగింగ్ వెళ్తున్న సమయంలో గుండె పోటుకు గురయ్యారు. హకీ వేల్స్ సీఈఓ అయిన పాల్ వామప్, స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలో తన ఇంటి నుంచి ఉదయం జాగింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. ప్రమాదకర పరిస్థితుల్లో తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ ద్వారా తన భార్యతో సంభాషించగలిగాడు. వెంటనే స్పందించడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘ నేను మామూలుగా ఉదయం 7 గంటలకు జాగింగ్ కోసం బయటకు వెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత ఛాతిలో విపరీతమైన నొప్పి వచ్చింది. నా ఛాతి పట్టేసినట్లు అయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతూనే.. నా భార్య లారాకు ఫోన్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించాను. అదృష్టవశాత్తు ఇంటికి 5 నిమిషాల దూరంలో ఉండటంతో, ఆమె నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగలిగింది. పారామెడిక్స్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు’’ అని ఆయన వెల్లడించారు.
గుండె ధమనుల్లో బ్లాకేజీ కారణంగా అతనికి గుండెపోటు సంభవించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆస్పత్రిలో శస్త్రచికిత్స తర్వాత పాల్ ఇంటికి చేరుకున్నారు. తాను పెద్దగా బరువు ఉండనని, భారీకాయుడిని కాదని అయినా నాకు గుండె పోటు రావడం కుటుంబాన్ని షాక్‌కి గురిచేసిందని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన భార్య, డాక్టర్లకు పాల్ థాంక్స్ తెలిపారు. స్మార్ట్‌వాచ్‌లు గతంలో కూడా కొందర్ని రక్షించాయి. హార్ట్ రేట్, ఈసీజీ లను కొలిచే సెన్సార్లు ఉంటున్నాయి. ఇది అసాధార పరిస్థితుల్లో సాయపడుతున్నాయి.