తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్‌షీర్‌లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేశారు తాలిబన్లు.. సెప్టెంబర్ 11న మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని వారం రోజుల క్రితమే ప్రకటించిన తాలిబన్లు.. పాకిస్థాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, కతర్ సహా పలు దేశాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కూడా.. కానీ, తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
తాలిబన్లు మంత్రుల ప్రమాణస్వీకారాన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం… అమెరికాలోని న్యూయార్క్ జంట టవర్ల (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి జరిగి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేమని మిత్రదేశాలు తేల్చేసినట్టు సమాచారం.. దీనిపై దోహా నుంచి తాలాబన్లపై ఒత్తిడి కూడా వచ్చిదని అంతర్జాతీయ మీడియా పేర్కొటొంది.. దాని కారణంగానే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రద్దు చేశారు.. మళ్లీ ఎప్పుడు మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది అనేదానిపై త్వరలోనే తాలిబన్లు ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, తాలిబన్ల కల్చురల్ కమిషన్ సభ్యుడైన ఇమానుల్లా సమంగాని ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆఫ్ఘన్ కొత్త సర్కార్ ప్రమాణస్వీకారాన్ని కొన్ని రోజుల క్రితమే రద్దు చేశాం.. ప్రజలు గందరగోళానికి గురి కాకుండా ఇప్పటికే మంత్రివర్గాన్ని ప్రకటించామని.. వారు పనిచేయడం కూడా ప్రారంభించారని పేర్కొన్నారు.