Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనీయులను టార్గెట్ చేస్తూ, పాకిస్తాన్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. పలు సందర్భాల్లో చైనా ఈ విషయంలో పాకిస్తాన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కలల ప్రాజెక్ట్ సీపెక్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుపై చైనా వెనక్కి తగ్గింది. దీంతో పాకిస్తాన్ ఈ ప్రాజెక్టు కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రుణం పొందేందుకు ప్రయత్నిస్తోంది. మెయిన్ లైన్-1(ML-1) రైల్వే ప్రాజెక్టు ను అప్‌గ్రేడ్ చేయడానికి 2 బిలియన్ డాలర్ల రుణాన్ని కోరుతోంది. ఈ రైల్వే ప్రాజెక్టు కరాచీ – రోహ్రీ మధ్య ఉంది. మొత్తం 6.7 బిలియన్ డాలర్లతో అంచాన వేయబడిన ఈ ప్రాజెక్టులో కరాచీని పెషావర్‌తో లింకు చేసే రైల్ కారిడార్ ఆధునీకకరించబడుతోంది.
50 బిలియన్ డాలర్ల విలువైన సీపెక్ ప్రాజెక్టులో ఇది వెన్నెముకగా పరిగణించబడుతోంది. అయితే, ఏడీబీ బ్యాంక్ ఈ ప్రాజెక్టును జూలైలో పరిశీలించింది, దీనికి ఆర్థిక సాయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, సీపెక్ ప్రాజెక్టులో చైనా కాకుండా వేరే ఏజెన్సీ నిధులు సమకూర్చడం ఇదే తొలిసారి అవుతుంది. దీనికి చూస్తే, చైనా విధానంలో మార్పు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ ప్రాజెక్టులో మూడో పక్షం ప్రయేయాన్ని ప్రోత్సహించారు.
పాకిస్తాన్ పట్ల చైనా విధానంలో మార్పు కనిపిస్తోంది. నిజానికి పాకిస్తాన్లో చేపడుతున్న ప్రాజెక్టు గుదిబండగా మారింది. అనేక అవాంతరాలు, తిరుగుబాటుదారుల దాడులతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగడం లేదు. 2021 నుంచి 21 మంది చైనా జాతీయులు హత్యలకు గురయ్యారు. దీనికి తోడు పాకిస్తాన్, చైనా విద్యుత్ ఉత్పత్తిదారులకు 1.5 బిలియన్ డాలర్లు బాకీ ఉన్నారు. పాకిస్తాన్ ఉన్న ఆర్థిక సమస్యల్లో, ఆ దేశంలో ఏ పెట్టుబడి పెట్టినా నష్టమే అని చైనా గ్రహించినట్లు ఉంది.