Saudi Arabia: ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఇస్లాంకు పుట్టినిల్లుగా ఉన్న సౌదీ అరేబియా కూడా మారాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సౌదీ ప్రభుత్వం మధ్యం కొనుగోలు నిబంధనల్ని కొంచెం సడలించింది. నెలకు 50,000 రియాల్స్ ($13,300) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులు మద్యం కొనుగోళ్లు చేయడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!
రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఏకైక మద్యం షాప్ మాత్రమే ఉంది. ఇది గతంలో విదేశీ దౌత్యవేత్తల కోసం ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు ఇస్లామేతరులకు కూడా సాలరీ నిబంధనపై అమ్మకాలకు అనుమతించినట్లు తెలుస్తోంది. కొత్త వెసులుబాటు ప్రకారం, మద్యం కొనుగోలు కోసం షాప్‌లోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి సాలరీ సర్టిఫికేట్లు చూపించాల్సి ఉంటుంది. రియాద్‌లోని లిక్కర్ స్టోర్ గతంలో విదేశీ రాయబారుల కోసం ఉండగా, ఇప్పుడు ప్రీమియం రెసిడెన్సీ ఉన్న నాన్-ముస్లిం నివాసితులకు కూడా అనుమతి లభించింది. ఈ కొనుగోళ్లను నెలవారీ పాయింట్ బేస్డ్-అలవెన్స్ సిస్టమ్ ద్వారానే చేయవచ్చు. భవిష్యత్తులో సౌదీలోని ఇతర నగరాల్లో కూడా కొత్త లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
సౌదీ ప్రభుత్వం మద్యం, సామాజిక నియమాల సడలింపుల ద్వారా వ్యాపార, పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలని చూస్తోంది. గత కొన్నేళ్లలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. మహిళల్ని డ్రైవింగ్ కు అనుమతించడం, ప్రజావినోదం, సంగీతం, ఆడామగా సమావేశాలకు అనుమతించడం వంటివి చేసింది. ఇస్లాంకు జన్మభూమిగా మక్కా, మదీనాలకు పవిత్ర నగరాలకు కేంద్రంగా ఉన్న సౌదీలో ఈ మార్పులు చాలా సున్నితమైనవిగా ఉన్నాయి.