రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సాధ్యపడలేదు. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ నేతలను వైట్‌హౌస్‌కు పిలిపించి చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం ఎటూ తెగడం లేదు. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులకు తెగబడింది. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది.
ఇది కూడా చదవండి: Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు
అయితే పుతిన్ కొత్త ప్రాతిపాదనలు పెట్టినట్లుగా రాయిటర్స్ పేర్కొంది. తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని.. అలాగే నాటోలో చేరే ప్రయత్నాన్ని విరమించాలని.. ఇక పాశ్చాత్య దళాలు దేశంలోకి ప్రవేశించకుంండా నిరోధించాలని పుతిన్ పట్టుబడుతున్నట్లుగా రాయిటర్స్ నివేదించింది. ఈ మూడు పాయింట్ల దగ్గరే చర్చలు ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇంకోవైపు ట్రంప్‌పై యూరోపియన్ దేశాలు భీకరమైన ఒత్తిడి తెస్తున్నాయి. ఉక్రెయిన్‌కు భద్రతా హామీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా ఇరు వర్గాల ఒత్తిడితో ట్రంప్ తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఎటు పంచాయితీ తెగడం లేదు. ఇదిలా ఉంటే జెలెన్స్కీతో చర్చలకు పుతిన్ అంగీకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: జంతు ప్రేమికులకు ఊరట.. వీధి కుక్కల తీర్పుపై కీలక పరిణామం
గత నాలుగేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌పై భారీగా సుంకాలు కూడా పెంచేశారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే శాంతి ఒప్పందానికి రావడం లేదని లేనిపోని ఆరోపణలు ఆమెరికా చేస్తోంది. ఇటీవల అలాస్కా వేదికగా పుతిన్‌తో 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఏ మాత్రం ప్రయోజనం లభించలేదు.
అయితే రష్యా చేసిన మూడు డిమాండ్లు అంగీకరించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని సమాచారం. ఇంకోవైపు ఆ ప్రాంతాన్ని అప్పగించకపోతే యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా హెచ్చరిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.