రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు వీరిద్దరి మధ్య 2 గంటల పాటు సంభాషణ జరిగింది. ఈ ఫోన్ కాల్ సంభాషణతో తర్వాత ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. పుతిన్‌తో తన సంభాషణ చాలా బాగా సాగిందని తెలిపారు. ఈ చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిస్తామని పుతిన్ చెప్పినట్లుగా ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ మాత్రమే చర్చించుకుంటాయని.. ఇతరుల జోక్యం ఉండదన్నారు. ఎందుకంటే ఎవరికీ తెలియని వివరాలు వారికి మాత్రమే తెలుస్తాయని.. ఈ విధానమే ఏకైక మార్గం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Salman Khan: కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రెండు గంటల పాటు మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లేయన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌లతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని వారికి తెలియజేసినట్లు చెప్పారు. ఇక ఫోన్ కాల్ సంభాషణ తర్వాత పుతిన్‌ను ట్రంప్ ప్రశంసించారు. అద్భుతం అంటూ కొనియాడారు.
పుతిన్ కృతజ్ఞతలు..
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్‌నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. శాంతి స్థాపన పురోగతికి పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే శాంతి స్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇరుదేశాల్లో శాంతి కోసం ఉత్తమమైన మార్గాలను వెతకడం ప్రస్తుతం ముఖ్యమని పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పుతిన్ నిజాయతీని యురోపియన్ నేతలు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Balochistan: బలూచిస్తాన్‌లో బలవంతంగా అదృశ్యం అవుతున్న బలూచ్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు శ్రీకారం చుట్టారు. దీంతో సౌదీ అరేబియా వేదికగా అమెరికా-రష్యా అధికారులు చర్చలు జరిపారు. కానీ సఫలీకృతం కాలేదు. దీంతో ట్రంప్‌నకు వేరే పనులు ఉన్నాయి. చర్చల నుంచి తప్పుకుంటామని అమెరికా రక్షణమంత్రి ప్రకటించారు. అయితే ఇటీవల ట్రంప్ పశ్చిమాసియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగొచ్చని వార్తలు వినిపించాయి. ఇందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా వచ్చారు. కానీ పుతిన్ రాకపోవడంతో మళ్లీ సందిగ్ధంలో పడింది. మొత్తానికి ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత కీలక పురోగతి లభించింది.