ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని బంకర్లలో దాదాపు 800 మంది తలదాచుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. అందులో దాదాపు 400 మంది వరకు ఉక్రెయిన్ సైనికులేనని ఓ రష్యా రాయబారి తెలిపారు.
ఇళ్లను రష్యా శతఘ్నులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ హైదాయ్ చెప్పారు. ఖేర్సన్, జపోరిజిజియాలలో తమ దళాలు కొన్ని పట్టణాలు, గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకొన్నాయని వెల్లడించారు. సీవీరోదొనెట్స్క్- లీసీచన్స్క్ మధ్య అనుసంధానికి ఉన్న రెండో వంతెననూ రష్యా బలగాలు ధ్వంసం చేశాయని చెప్పారు.
రష్యా తెర తీసిన అకారణ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనేది ఎవరికీ తెలియదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఆయన అన్నారు. తమ దేశ తూర్పు ప్రాంతాలను గుప్పిట పట్టేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుంటున్నామని, పుతిన్ సేనల అంచనాలను వమ్ము చేస్తున్నామని చెప్పారు. యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖేర్సన్ నుంచి కూడా రష్యా బలగాలను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన చెప్పారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. డాన్‌బాస్ను రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడిందని జెలెన్‌స్కీ వెల్లడించారు. కానీ నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉందన్నారు. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న ఉక్రెయిన్ సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. తమకంటే మూడు రెట్లు ఎక్కువగా సైనికుల్ని రష్యా కోల్పోయి ఉంటుందని చెప్పారు.
ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పౌరులకు రష్యా పాస్‌పోర్టుల జారీ, రష్యా ఛానళ్ల ప్రసారం, రష్యా స్కూలు యూనిఫాం ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుండటం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది.