Rishi Sunak Reaction After Defeat In Britain Leadership Race: హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటన్ ప్రధాని పోటీల్లో.. 47 ఏళ్ల లిజ్ ట్రస్ విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ పోరులో ఆమె ప్రత్యర్థిక రిషి సునాక్ (42) ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విటర్ వేదికగా ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన రిషి.. నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు అండగా ఉండాలని కన్జర్వేటివ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ నేతలంతా ఒకే కుటుంబమని తాను ముందు నుంచే చెప్తూ వస్తున్నానని, ఇప్పుడు కష్టకాలాల్లో ఉన్న బ్రిటన్‌ను లిజ్ ట్రస్ నడిపించనున్నారు కాబట్టి అందరం ఆమెకు మద్దతు తెలుపుదామని తెలిపారు. ఇలాంటి సమయంలో అందరూ ఆమె వెన్నంటి నిలవడమే సరైదని చెప్పారు. కాగా.. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఓడిపోతే, తదుపరి ప్రభుత్వానికి కచ్ఛితంగా సహకరిస్తానని చెప్తూ వచ్చాడు. ఆ మాట ప్రకారం, లిజ్ ట్రస్‌కు మద్దతు తెలిపాడు.
ఇదిలావుండగా.. ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌కు మొత్తం 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. అంటే.. దాదాపు 21 వేల ఓట్ల తేడాతో సునాజ్‌పై లిజ్ ట్రస్ మెజారిటీ సాధించారు. కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న సభ్యుల్లో 1,72,437 మందికి ఓటు హక్కు ఉండగా, పోలింగ్ నాడు 82.6 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్ని కారణాల వల్ల 654 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్, తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన లిజ్.. తాను ప్రజల ప్రధానిగా ఉంటానన్నారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ప్రయశ్నిస్తానని చెప్పింది. ఇంధన సంక్షోభాన్ని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది.