శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది.. రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దిగుమతులు చేసుకోలేని దుస్థితికి చేరుకోవడంతో కొలంబలో పేపర్ నిల్వలు అయిపోయాయి. దీంతో ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోతోంది. నేటి నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నా పత్రాల తయారీకి సరిపడా పేపర్, ఇంక్‌ను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం లేని కారణంగా పరీక్షలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల మంది విద్యార్థుల్లో 30 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. 1948 నుంచి దేశంలో ఇంతటీ దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదని శ్రీలంక విద్యాశాఖ అధికారులు వాపోతున్నారు. విదేశీ మారక నిల్వలు 1.6 బిలియన్ల డాలర్లకు పడిపోయాయి. దిగుమతులకు డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం ఆహార వస్తువులు సహ అనేక నిత్యావసర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. ఊహించని ఆర్థిక సంక్షోభంతో 2.20 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక ఉక్కిరిబిక్కిరవుతోంది.
Read Also: Lakshya Sen: నెరవేరని లక్ష్యసేన్ కల..!
ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల కారణంగా రోజుకు మూడు పూటల తిండి తినలేకపోతున్నామని అక్కడి కుటుంబాలు వాపోతున్నాయి. రోజు కూలీ పని చేసుకొని పొట్టపోసుకునేవారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. కోవిడ్ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు మహమ్మారి కారణంగా అది 90 శాతం వరకు పడిపోయింది. తమ దగ్గర కూడా ఎటువంటి ఆప్షన్స్ లేవని శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యతాయుత ప్రభుత్వంగా తాము నెట్టుకొస్తున్నామని శ్రీలంక మంత్రి షేహాన్ సెమెసింగే అన్నారు. మరోవైపు భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలపై శ్రీలంకలోని విపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. పెరుగుతున్న ధరలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే వన్ బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పెంచింది. పేదలకు కొంత ఆర్థిక చేయూత అందించడంతో పాటు కొన్ని ఆహార వస్తువులు, ఔషధాల ధరలపై పన్నులు తొలగించింది.
అటు అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 2020లో యూరోప్ నుంచి ఆసియా దేశాలకు ఒక ప్రామాణిక కంటెయినర్ పంపించేందుకు అయ్యే షిప్పింగ్ ఖర్చు 2000 డాలర్లు ఉండగా అది గత సంవత్సరం 10000 డాలర్లకు పెరిగింది. భారీగా పెరిగిన సరుకు రవాణా రేట్లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ హెచ్చరించింది. దిగుమతుల కోసం పూర్తిగా సముద్ర రవాణాపైనే ఆధారపడే శ్రీలంక వంటి చిన్న ద్వీప దేశాలు తట్టుకోలేవని తెలిపింది. గతంలో జరిగిన ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు తీవ్రమైన ముప్పుగా మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు లంక ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా బెడిసి కొట్టడంతో ఆ దేశం పరిస్థితి దుర్భరంగా మారింది. ఇటీవలే, భారత్ సైతం లంకకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. మరో 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. దక్షిణాసియా దేశాల ప్రధాన రుణదాతలలో ఒకరైన చైనాను రుణ చెల్లింపుల కోసం సహాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అభ్యర్థించింది. అయితే, బీజింగ్ ఇంకా స్పందించలేదు. శ్రీలంక తన దిగజారుతున్న విదేశీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, బాహ్య నిల్వలను పెంచుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిలౌట్‌ను కోరుతుందని ప్రకటించింది.
ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు సుమారు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయి. 1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలకు.. ప్రభుత్వానిదే బాధ్యతంటూ గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొలంబొలోని అధ్యక్ష భవంతిని.. వందలాది మంది ప్రజలు ముట్టడించగా అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అటు విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ప్రజల్లో పెల్లుబికిన నిరసన సెగలతో ప్రభుత్వం గద్దె దిగక తప్పదని విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్నంటాయి. ఏ వస్తువు కొందామన్నా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ. 275కు పడిపోయింది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు. ముడిచమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. ఇక కోడి గుడ్డు ధర 35, కిలో చికెన్ 1000, కిలో ఉల్లి ధర 200 నుంచి 250, కేజీ పాలపొడి ప్యాకెట్ ధర 1945, లీటర్ కొబ్బరి నూనె 900, టీ ధర 100,కు చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం క్యూలైన్‌లో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు కొలంబో పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్‌లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు వెల్లడించారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు.