Ukraine War: ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొలిక్కిరావడం లేదు. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధాల మోహరింపు గురించి కీలక వ్యాఖ్యలుచేశారు. జూలై 7-8 తేదీలలో అన్ని ఏర్పాట్లు సిద్ధమైన తర్వాత రష్యా మిత్రదేశం బెలారస్ లో వ్యూహాత్మక అణ్వాయుధాలు మోహరించడం ప్రారంభిస్తామని శుక్రవారం వెల్లడించారు. ప్రతీది ప్రణాళిక ప్రకారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Kasturi: ప్రభాస్ అస్సలు రాముడిలా లేడు.. ఇలాంటి వికారమైన పనులు ఎందుకు..?
రష్యా ల్యాండ్ బేస్డ్ స్వల్ప శ్రేణి అణు క్షిపణులను బెలారస్ లో మోహరించే ప్రణాళికను మోహరిస్తుందని గతం కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బెలారస్ ఉక్రెయిన్ యుద్ధంలో చాలా కీలకంగా ఉంటుందని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ ను అనుకుని బెలారస్ ఉండటం రష్యాకు కలిసి వస్తుంది. ముఖ్యంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో రష్యాకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారు.
మరోవైపు ఉక్రెయిన్ లో నోవా కకోవ్కా డ్యామ్ పై దాడి తర్వాత ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరం పూర్తిగా జలమయం అయింది. డ్యామ్ పై దాడి రష్యా పనే అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే వేలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులు అయ్యారు. మరోవైపు నీటిలో కొట్టుకువస్తున్న ల్యాండ్ మైన్స్ వల్ల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజల తరలింపును వేగం చేసింది. అధ్యక్షుడు జెలన్ స్కీ వరద ప్రాంతాల్లో పర్యటించారు.