Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారు. శుక్రవారం ఖోకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనప్రదేశం కాంగ్ పోక్పి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. అనుమానిత ఉగ్రవాదులు, బాధితులు వేర్వేరు వర్గాలకు చెందినవారిగా గుర్తించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం(ఐటీఎల్ఎఫ్) డిమాండ్ చేసింది.
మే ప్రారంభంలో మైయిటీ, కూకీల మధ్య ఘర్షణ తలెత్తింది. క్రమంగా ఇవి హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. 35,000 మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్ ను వ్యతిరేకిస్తూ.. కుకీలు ‘గిరిజన సంఘీభావ యాత్ర’’ నిర్వహించిన సమయంలో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణల వెనక కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తులో ఈ ఘర్షణల్లో కుట్ర ఉందో లేదో తెలియనుంది. హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3700 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇందులో ఎక్కువగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంగ్‌పోక్పి, బిష్ణుపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read Also: Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్
ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించారు. మైయిటీ, కూకీ, నాగా కమ్యూనిటీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత మణిపూర్ లో శాంతియుత పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. నిర్వాసితులకు సాయం చేయడానికి రూ.101.75 కోట్ల సహాయప్యాకేజీకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
హింస ప్రారంభమైనప్పటి నుండి, మణిపూర్‌లోని పోలీసు ఆయుధాలు మరియు శిబిరాల నుండి 4,000 పైగా ఆయుధాలు లూటీ చేయబడ్డాయి. అయితే, భద్రతా బలగాలు మొత్తం 896 ఆయుధాలు, 11,763 మందుగుండు సామాగ్రి మరియు 200 వివిధ రకాల బాంబులను స్వాధీనం చేసుకున్నాయి, వీటిలో బుధవారం నుండి స్వాధీనం చేసుకున్న మరో 28 ఆయుధాలు ఉన్నాయి.