Protests in Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్ట్ చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పీటీఐ పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
Read Also: LinkedIn: ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ అంతటా ఆందోళనలు మిన్నింటుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపైకి వస్తున్నారు. పాక్ లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి, క్వెట్టా ఇలా అన్ని నగరాల్లో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. కరాచీలో నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కరాచీ ప్రధాన రహదారి షరియా ఫైసల్ ను పీటీఐ కార్యకర్తలు బ్లాక్ చేశారు. నగరంలోని మెయిన్ యూనివర్శిటీ రోడ్, ఓల్డ్ సబ్జీ మండి, బనారస్ చౌక్ నిరసనలు తెలిపారు.
ఇక ఆందోళనల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో సెక్షన్ 144ను విధించారు. ఇమ్రాన్ ఖాన్ సొంత నగరం లాహోర్ లోని ఆర్మీ కంటోన్మెంట్ ను ఆందోళనకారులు చుట్టుమట్టారు. పీటీఐ మద్దతుదారులు కంటోన్మెంట్ ప్రాంతంలోని సైనిక అధికారుల నివాసాల్లో ప్రవేశించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన స్థావరంగా ఉన్న రావల్పిండి సైనిక కార్యాలయాల్లోకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రవేశించారు. కైబర్క ఫక్తుంక్వాలో కూడా నిరసనలు చెలరేగాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా లో ఆర్మీ కంటోన్మెంట్ ముందు పీటీఐ కార్యకర్తలు గుమిగూడారు.