ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఇందుకోసం తన బృందంతో కలిసి సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు షెహబాజ్ షరీప్ అమెరికాలో ఉండనున్నారు. పర్యటనలో భాగంగా షరీఫ్.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక
షరీఫ్ వెంట విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఇతర మంత్రులు, సీనియర్ నాయకులు ఉండనున్నారు. ‘‘ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్ సమావేశం అవుతారు.’’అని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
షెహబాజ్ షరీఫ్ ఎజెండా..
ఇక యూఎన్ సమావేశంలో షరీఫ్ ప్రసంగించనున్నారు. గాజాలో తలెత్తిన మానవతా సంక్షోభంపై మాట్లాడనున్నారు. దీర్ఘకాలిక సంఘర్షణలను పరిష్కరించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరనున్నారు. పాలస్తీనా ప్రజల బాధలను పరిష్కరించడానికి నిర్ణయాత్మక చర్యకు పిలుపునివ్వనున్నట్లు సమాచారం. అలాగే ప్రాంతీయ భద్రతా పరిస్థితిపై కూడా మాట్లాడనున్నారు. అలాగే వాతావరణ మార్పు, ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ప్రస్తావించనున్నారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది
ఆ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించాడు. ఆ సమయంలో వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. తాజాగా పాక్ ప్రధాని షరీఫ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈసారి ట్రంప్ ఎలా స్వాగతం పలుకుతారో చూడాలి. ఈ మధ్య ట్రంప్.. పాకిస్థాన్‌తో సంబంధాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ అంశాలు చర్చకు వస్తాయా? లేదా? అన్నది చూడాలి. అలాగే భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత షరీఫ్ తొలిసారి ట్రంప్‌ను కలవబోతున్నారు.