Pakistan Takes Cost-Cutting Measures To Address Financial Emergency: దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరో శ్రీలంకలా తయారయ్యేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పాక్ సర్కార్ నానా కష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని రేషన్ ఇవ్వడంతో పాటు అధికారిక ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోంది. లీవ్ క్యాష్ మెంట్ నిలిపివేయడంతో పాటు మెడికల్ బిల్లల చెల్లింపులు, అలవెన్స్ లను తొలగించడం వంటి చర్యలను తీసుకోబోతోంది.
Read Also: BIG Breaking: నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక!
పాకిస్తాన్ క్యాబినెట్ సెక్రటేరియట్ ఇటీవల దీనికోసం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. తీవ్రమైన నిధుల కొరత వల్ల కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ వాహనాలకు నెలకు 120 లీటర్ల కంటె ఎక్కువ ఇంధనం ఇవ్వకూడదని.. అధికారిక పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు వారి గ్రేడ్ ప్రకారం రెండు డీఏలు మాత్రమే ఇవ్వాలని.. ఒక డీఏ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. 17-21 గ్రేడ్లకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఎన్‌క్యాష్‌మెంట్ వెంటనే నిలిపివేయనున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 25 శాతం కన్నా ఎక్కువ ఉన్న అన్ని అలవెన్సులను తొలగించనుంది. ఆర్థిక కష్టాలు తగ్గేవరకు ఉద్యోగులకు ఎలాంటి మెడికల్ బిల్లలు ఇవ్వబోవడం లేదని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగుల వేతనాల నుంచి 50 శాతం జీతం కోత విధిస్తామని తెలిపింది.
పాకిస్తాన్ గత కొన్ని నెలల నుంచి తీవ్ర ద్రవ్యోల్బనంతో ఇబ్బంది పడుతోంది. దీంతో పాటు ఇంధన కొరత కూడా ఆ దేశాన్ని వేధిస్తోంది. విదేశాలకు అప్పులు చెల్లించాలన్నా..పాక్ వద్ద విదేశీమారక ధనం లేదు. ఇక జాతీయ భద్రతతో పాటు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోంటోంది. పాక్ రూపాయి దినదినం పడిపోతోంది. ఈ పరిణామాలతో తక్షణమే ఆర్థిక చర్యలు తీసుకోకుంటే మరో శ్రీలంక కావడం ఖాయం అని తెలుస్తోంది.