Hamza Bin Laden: అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, 9/11 దాడుల నిందితుడు, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఆల్‌ఖైదా నాయకత్వాన్ని స్వీకరించాడని చెప్పాయి. 2019లో మరణించినట్లు భావిస్తున్న హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని నివేదికలు సూచించడం సంచలంగా మారింది. ఆల్‌ఖైదాను పునరుద్ధరించడంతో పాటు వెస్ట్రన్ దేశాలపై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.
మిర్రర్ ప్రచురించిన కథనం ప్రకారం.. టెర్రర్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్‌లో 10 ప్రధాన ఆల్ ఖైదా టెర్రర్ శిక్షణా శిబిరాలను అభివృద్ధి చేసిందని, పాశ్చాత్య దేశాలను ద్వేషించే గ్రూపులతో పొత్తు కుదుర్చుకుంటుందని తెలిపింది. హంజా నాయకత్వం ఆల్‌ఖైదాకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇరాక్ యుద్ధం తర్వాత అత్యంత ముఖ్యమైన పునరుద్ధరణ దిశగా హంజా ఆల్‌ఖైదాను నడిపిస్తున్నారని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. అతడి సోదరుడు అబ్దుల్లా కూడా ఉగ్రవాద సంస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు.
యూఎస్ దళాల మాజీ చీఫ్ కల్నల్ రిచర్డ్ కెంప్.. హంజా ఆఫ్ఘన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతడి తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటాడని హెచ్చరించారు. తాలిబాన్ నాయకులే ఆల్‌ఖైదాను రక్షిస్తున్నారని ఆరోపించారు. హంజాతో పాటు అతడి కుటుంబాన్ని కాపాడుతున్నారని, అతడితో తరుచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, అతడి భద్రతను సీనియర్ తాలిబాన్ నాయకుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 450 మంది స్నైపర్లతో హంజాకు సెక్యూరిటీ ఉంది.
Read Also: CHAKRASIDDH : ఔషధాల ప్రమేయం లేకుండా.. ‘చక్ర సిద్ధ’ పేరుతో సహజ చికిత్స
బ్రిటీష్ పత్రిక కథనం ప్రకారం..తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపుగా 21 టెర్రర్ నెట్వర్క్‌లు పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ నెట్వర్క్ వెస్ట్రన్ దేశాలపై దాడులు చేసేందుకు ఫైటర్స్, ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇస్తున్నట్లు నివేదించింది. 9/11 తరహా దాడులు జరిగేందుకు అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టెర్రర్ నెట్‌వర్క్‌ల కోసం శిక్షణా శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మాండ్, ఘజ్నీ, లఘ్‌మాన్, పర్వాన్, ఉరుజ్‌గాన్, జాబుల్, నంగర్‌హర్, నూరిస్తాన్, బాద్గీస్ మరియు కునార్‌లతో సహా వివిధ ప్రావిన్సులలో ఉన్నట్లు నివేదించబడింది.
అఫ్ఘాన్ యుద్ధవీరుడు సిరాజుద్దీన్ హక్కానీ కూడా హంజా బిన్ లాడెన్‌కు మద్దతిస్తున్నట్లు భావిస్తున్నారు. హంజా నిజానికి 2019లో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. 2019లో వైమానిక దాడిలో హంజా మరణించాడనే వాదన ఉంది. అయితే తాజా నివేదికలు మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని చెబుతున్నారు. ఇతని తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ని 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో స్పెషల్ ఆపరేషన్ చేసిన అమెరికా హతమార్చింది. ఇతను 9/11 దాడులకు ప్రధాన సూత్రధారి, ఈ దాడిలో 3000 మంది మరణించారు.