Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ హత్యకు భారత ఏజెంట్లే కారణమని అమెరికా నిందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి తాజగా ఓ సీసీటీవీ వీడియో బయటపడింది. జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది.
వాషింగ్టన్ పోస్టు దీనికి సంబంధించి ఓ కథనాన్ని ప్రచురించింది. అక్కడ ఉన్న సాక్షుల ప్రకారం.. ఈ హత్యలో మొత్తం ఆరుగురు పాలుపంచుకున్నారని, రెండు వాహనాల్లో వచ్చారని వెల్లడించారు. ఈ 90 సెకన్ల వీడియోలో గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఒక గ్రే కలర్ పికప్ ట్రక్, ఒక వైట్ సెడాన్ కార్లు గుర్తించబడ్డాయి. నిజ్జర్ ప్రయాణిస్తున్న పికప్ ట్రక్కు ఆగేలా, వైట్ కలర్ కారు బ్రేకులు వేయడం, హూడీస్ స్వట్ షర్టులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ట్రక్ డ్రైవర్ సీటుకు గురిపెట్టడం కనిపిస్తుంది. గుర్తు తెలియని దుండగులు 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇందులో 34 హర్దీప్ సింగ్ నిజ్జర్ శరీరాన్ని చీల్చేశాయి.
Read Also: Canada Army: దౌత్య వివాదం భారత్‌తో సైనిక సంబంధాలను ప్రభావితం చేయదు..
అక్కడే ఫుట్ బాల్ ఆడుతున్న భూపిందర్ సింగ్ ముందుగా ఇవి బాణాసంచా శబ్ధాలు అనుకున్నానని, ఆ తరువాత తమ అధ్యక్షుడిపై కాల్పులు జరిగాయని తెలిసిందని, తాను వెళ్లి చూసేటప్పటికీ నిజ్జర్ మృతదేహం రక్తంతో నిండిపోయిందని వాషింగ్టన్ పోస్టుకు వెల్లడించారు. ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు, సర్రే పోలీసుల మధ్య కేసువిచారణపై వాగ్వాదం జరిగిందని కథనం హైలెట్ చేసింది.
ఈ హత్య కెనడా, భారత దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతను పెంచాయి. ఏకంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరించింది, ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. భారత్, కెనడా వ్యాఖ్యల్ని తప్పపట్టింది. ఇది అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా విమర్శించింది.