Jane Fonda Warns Oceans Are Dying Amid UN Treaty Talks: జేన్ ఫోండా అంటే ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు. కానీ, ఒకప్పుడు ఫ్యాషన్ మోడల్ గానూ, నటిగానూ తనదైన బాణీ పలికించారు జేన్. ముఖ్యంగా ‘ఫిట్ నెస్’లో జేన్ ఫోండా వర్కవుట్స్ చూసి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సుందరాంగులు తమ అందానికి మెరుగులు దిద్దుకున్నారు. చాలా ఏళ్ళ నుంచీ సామాజిక కార్యకర్తగానూ సాగుతున్నారు జేన్. ప్రస్తుతం ఆమె వయసు 85 సంవత్సరాలు. ఈ వయసులోనూ “సముద్రాలను కాపాడుకుందాం” అనే నినాదంతో మళ్ళీ వార్తల్లో నిలిచారామె. యునైటెడ్ నేషన్స్ చర్చలు సాగుతున్న ఈ సమయంలో జేన్ ఫోండా తనదైన పంథాలో సముద్రాలను పరిరక్షించుకోలేక పోతే మనిషి మనుగడకే నష్టం వాటిల్లనుందని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై దాదాపు 55 లక్షల సంతకాలు సేకరించి, చర్చలకు అధ్యక్షత వహిస్తోన్న రినా లీకి సమర్పించారు పోండా. రినా లీ సింగపూర్ విదేశాంగ మంత్రి. ఆమె సముద్రాల సమస్యాపరిష్కార నివృత్తి ప్రతినిధిగా పాల్గొంటున్నారు.
Aamir Khan: ఆమిర్ ఖాన్ మళ్ళీ అటువైపేనా!?
భూగోళానికి దాదాపు యాభై శాతం ప్రాణవాయువు సముద్రాల నుండే లభిస్తోందని, వాటిని నాశనం చేసుకుంటే మానవజాతికే మహాప్రమాదం ముంచుకు వస్తోందని జేన్ ఫోండా ఈ సందర్భంగా హెచ్చరించారు. తనకు పిల్లలు, మనవలు, మనవరాళ్ళు ఉన్నారని, వారందరితోనూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని ఆమె అన్నారు. తాను జీవించి ఉన్నంత వరకూ ఓ పౌరురాలిగా పోరాటం చేసే హక్కు తనకుందనీ ఆమె చెప్పారు. భూగోళానికి ఏ విపత్తూ సంభవించకుండా పోరాటం సాగిస్తూనే ఉంటాననీ ఆమె తెలిపారు. దాదాపు పదిహేనేళ్ళ నుంచీ ఈ పోరాటం సాగిస్తున్నామని, ఈ సారి ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జేన్ ఫోండా. ఇప్పటి దాకా ఇంత ఆందోళన ఎప్పుడూ చెందలేదని, అయితే పరిస్థితి అలా ఉందనీ ఆమె వ్యాఖ్యానించారు. ఓ తల్లిగా, ఓ అమ్మమ్మగా, ప్రపంచంలో ఓ పౌరురాలిగా ఈ పోరాటం సాగిస్తున్నానని ఫోండా అన్నారు. ఈ సారి చర్చల్లో ‘సముద్రాల పరిరక్షణ’కు ప్రాధాన్యమిస్తారనే ఆమె ఆశిస్తున్నారు. మరి జేన్ అభ్యర్థనను ఏ మేరకు ‘యుఎన్’ పరిగణిస్తుందో చూడాలి.