గాజాలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు సైనిక ఆపరేషన్ మొదలు పెట్టాయి. బుధవారం భారీ స్థాయిలో ఐడీఎఫ్ దళాలు మోహరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హమాస్‌ను నిర్మూలించి.. బందీలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే అనేకమైన కీలక ప్రాంతాలను దళాలు స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ ప్రారంభించిన ప్రాంతాల నుంచి దళాలు ప్రజలను తరలిస్తున్నారు. బందీలను తిరిగి ఇచ్చేంత వరకు హమాస్‌ను వదిలిపెట్టే ప్రస్తక్తేలేదని కాట్జ్ హెచ్చరించారు.
బుధవారం దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక ఇంటిపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. ఈ దాడి అనంతరం పాలస్తీనియన్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా ఖాళీ అయిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే హమాస్ గాజాను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి ఐడీఎఫ్ సపోర్టు చేస్తోంది. నిరసనలను ప్రోత్సహిస్తోంది.
ఆ మధ్య మధ్యవర్తుల సాయంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. తొలి ఒప్పందంలో భాగంగా ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే ఈ ఒప్పందం ఇటీవల ముగిసింది. ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో ఈ మధ్య ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అయినా కూడా బందీలను విడిచిపెట్టకపోవడంతో బుధవారం ఇజ్రాయెల్ భారీ సైనిక మోహరింపు చేసింది.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలందరినీ ఒకేసారి అప్పగించాలని.. లేదంటే నరకం చూస్తారని హెచ్చరించారు. అయినా కూడా హమాస్ లెక్క చేయలేదు. ఇక గాజాను పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని.. అభివృద్ధి చేసి ఇస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఐడీఎఫ్ దళాలు.. గాజాను ఖాళీ చేయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.