ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు.
భారత విద్యార్థి నవీన్ ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో అక్కడి గవర్నర్ హౌస్/సిటీ హాల్‌పై రష్యా మిలటరీ మిస్సైల్ దాడి జరిపింది. దీంతో ఈ దాడిలో నవీన్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. వైద్య విద్య కోసం భారత్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్లారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు కూడా వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లగా.. అందులో నవీన్ కూడా ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడు రష్యా సైనికుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఇంకా 3-4 వేల మంది భారతీయులు ఖర్కీవ్‌లోనే చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.