Vivek Ramaswamy: అగ్రరాజ్యంలో స్థిరపడ్డ భారతీయ అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు.. బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమమన్నారు. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్న వివేక్ రామస్వామి.. అమెరికా అంటే ఏంటో తిరిగి తెలుసుకోవాలన్నారు. చైనా ముప్పును ధీటుగా ఎదుర్కొంటానన్నారు.
Read Also: MLC Election 2023: ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
ఒహాయోలో ఆగస్టు 9, 1985లో వివేక్ రామస్వామి జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు.. నాలుగు దశాబ్దాల క్రితమే ఆమెరికాకు వలస వచ్చారు. వివేక్.. సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా చెప్పుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన వివేక్..స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. ఔషధరంగంలోనూ వివేక్ రామస్వామికి మంచి పేరుంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం..600 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.. ప్రస్తుతం వివేక్ వయస్సు 37 ఏళ్లు. నిక్కీ హెలీ తర్వాత అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తానని ప్రకటించిన రెండో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఆయనే.. నిక్కీ హెలీ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం.