China: వర్షాలు భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతు రుతుపవనాల నేపథ్యంలో భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు.. వరదల మూలంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు. ఇండియాతోపాటు అమెరికా, చైనాలోనూ భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో భారీవర్షాల కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని నగరం బీజింగ్‌లో వరదల కారణంగా 11 మంది మృతి చెందగా.. 27 మంది వరదనీటిలో గల్లంతయ్యారు. నగరాన్ని వరద ముంచెత్తడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మేరకు మంగళవారం స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
Read also: Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
చైనా దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో బాధితులను పాఠశాలలు, రైల్వే స్టేషన్లు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీజింగ్ కొంతవరకు పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇంతటి భారీ వర్షపాతం నమోదవ్వడం అసాధారణం. ఉత్తర చైనాలోని చాలా ప్రాంతాల్లో వరదలు చాలా అరుదు. ఈ అసాధారణ పరిస్థితి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 50 ఏళ్లలో ఎన్నడు లేనంతగా ఉత్తర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. గత నెలలో వరదల కారణంగా చాంగ్ కింగ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 15 మంది మరణించారు. లియానింగ్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లో దాదాపు 5,590 మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. హుబేలో తుపాను కారణంగా కొందరు వాహనాల్లో చిక్కుకుపోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 1998లో చైనాలో భారీ వరదలు సంభవించాయి. దీని వల్ల 4,150 మంది మృతి చెందారు. ఎక్కువగా యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2021లో హెనాన్ రాష్ట్రంలో వరదల కారణంగా 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు.