Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి టూరిస్ట్ వీసాపై సింగపూర్ లోనే ఉంటున్నాడు గోటబయ రాజపక్స.
అయితే తాజాగా థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. తాత్కాలికంగా కొన్ని రోజులు ఆశ్రయం కోరినట్లు తెలిసింది. రాజపక్స థాయ్‌లాండ్ లో రాజకీయ ఆశ్రయం కోరలేదని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే గోటబయ రాజపక్స థాయ్‌లాండ్ వస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్‌కు ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా కూడా ధ్రువీకరించారు. గురువారం రాజపక్స బ్యాంకాంక్ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. థాయ్‌లాండ్ లో ఉన్నంత కాలం రాజపక్స ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరని ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
READ ALSO: Anand Mahindra: బాలుడి స్టంట్స్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం గోటబయ రాజపక్స థాయ్‌లాండ్ లో ఉండేందుకు మద్దతు ఇస్తోందని.. థాయ్‌లాండ్‌కు రాజపక్సకు 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పించిందని తెలిపారు. గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోయి కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే అధికార బాధ్యతలు చేపట్టిన శ్రీలంకలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇప్పటికీ ప్రజల కష్టాలు అలానే ఉన్నాయి. నిత్యావసరాల కోసం, పెట్రోల్ కోసం క్యూలు కడుతున్నారు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలపై అక్కడి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల రూపంలో మరింత భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం కరెంట్ ఛార్జీలు పెంచింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు.