ఆకాశంలో ఖగోళ అద్భతం చోటు చేసుకోబోతోంది. వరసగా ఐదు గ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయి. సాధారణంగా ఒకే సరళరేఖపై రెండు మూడు గ్రహాలు కనిపించడం మనం రెగ్యులర్ గా చూస్తునే ఉంటాం.. కానీ ఏకంగా ఐదు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా ఒకే వరసలో కనిపించడం చాలా అరుదు. ఈ అరుదైన ఘటన జూన్ 23 నుంచి జూన్ 25 వరకు కనివిందు చేయనుంది. గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్న సందర్భంలో ఒకే వరస క్రమంలోకి రావడం చాలా అరుదుగా జరగుతుంది. దాదాపుగా కొన్ని వందల ఏళ్లకు ఒకసారి ఇటువంటి ఘటనలు జరగుతుంటాయి. చివరిసారిగా మార్చి 5, 1864లో చివరిసారిగా ఇలాంటి ఖగోళ అద్భుతం కనిపించింది. మళ్లీ 158 ఏళ్ల తరువాత గ్రహాలన్ని వరసగా ఆకాశంలో దర్శనమిస్తున్నాయి.
బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని ఇలా ఐదు గ్రహాలు కూడా ఒకే వరసలో కనివిందు చేయనున్నాయి. అయితే జూన్ నెలలో ఈ ఐదు గ్రహాలు ఒకే వరసలోకి వస్తున్నప్పటికీ.. చివరి వారంలో మాత్రమే స్పష్టంగా కనిపించనున్నాయి. తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణ వైపుగా ఈ ఐదు గ్రహాలు ఒక ఆర్క్ ను ఏర్పరుచనున్నాయి. మొదటగా బుధుడు, ఆ తర్వాత వరసగా శుక్రుడు, కుజుడు, గురుడు, శని గ్రహాలను చూడవచ్చు. సూర్యోదయానికి 30 నుంచి 40 నిమిషాల ముందు ఆకాశంలో చూస్తే ఈ ఐదు గ్రహాలను వీక్షించే అవకాశం ఉంటుంది.