USA: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించాడు. ట్రంప్ దెబ్బతో అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పరుగు తీస్తున్నారు. విదేశీ వస్తువులపై సుంకాలు ప్రకటించిన కొన్ని రోజు తర్వాత, ధరలు తక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువుల్ని కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో స్టోర్లు, సూపర్ మార్కెట్ల ముందు రద్దీ పెరిగింది.
బట్టలు, బూట్లు, ఫర్నీచర్, కాఫీ వంటి ముఖ్యమైన వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ది బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఇన్నాళ్లు కొంత కాలం వేచి చూద్దాం అనుకున్న కస్టమర్లు కూడా ట్రంప్ టారిఫ్ భయం వల్ల ఇప్పటికిప్పుడు తమకు కావాల్సిన వస్తువుల్ని షాపింగ్ చేస్తున్నారు. అధిక ధరలు చెల్లించకుండా ఉండేందుకు అమెరికన్లు తొందర పడుతున్నాడు. ముఖ్యంగా అమెరికా వెలుపల అసెంబుల్ అయిన ఆటోమొబైల్స్ కొనాలనుకునే వారు, ఇప్పుడే కొంటున్నారు.
Read Also: Ponguleti Sudharkar Reddy : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి
అమెరికన్లు కొంటున్న వస్తువులు ఇవే..
ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు
ట్రంప్ తైవాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 32 శాతం, చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిపై 52 శాతం సుంకాలు విధించడంతో అమెరికన్లు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు తొందరపడుతున్నారు. వీటి భాగాలు ఎక్కువగా విదేశాలు, ముఖ్యంగా చైనా నుంచి వస్తాయి.
దుస్తులు, బూట్లు
అనేక బ్రాండెడ్ బట్టలు ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాం నుంచి అమెరికాకు వస్తుంటాయి. దీంతో ఈ దేశాలపై సుంకాలు అమలులోకి రాకముందే ఎక్కువ దుస్తులు కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. అమెరికన్లు జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్‌లతో పాటు షూలను కొనుగోలు చేస్తున్నారు.
ఆటోమొబైల్స్
కొత్త కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని ప్లాన్ చేసుకున్న వారు, అమెరికాకు దిగుమతి అయిన కార్లను కొనుగోలు చేయడానికి షోరూంలకు పరిగెత్తుతున్నారు. ధరలు పెరగక ముందే కార్లు బుక్ చేయాలని భావిస్తున్నారు.
విదేశీ ఆహారాలు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆహార పదార్థాలను కొనేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కాఫీ, స్నాక్స్, మసాలా దినుసులు, ఇతర కిరాణా వస్తువులను కొంటున్నారు. సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే నిల్వ చేసుకుంటున్నారు.
జిమ్ అండ్ వెల్‌నెస్ పరికరాలు
ట్రెడ్ మిల్స్, స్టేషనరీ బైక్‌లు, మసాజ్ చైర్స్, జిమ్ పరికరాలు వివిధ దేశాల నుంచి అమెరికాకు వస్తుంటాయి. వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.
ఎలక్ట్రిక్ పరికరాలు:
ధరలు పెరగకముందే అమెరికన్లు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు మరియు డిష్‌వాషర్లు వంటి హోమ్ నీడ్స్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. చైనా, తైవాన్ నుంచి ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువులు వస్తుంటాయి. ఈ రెండు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు.
ఇతర వస్తువుల్లో భవన నిర్మాణ సామాగ్రి, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులైన డైపర్లు, బొమ్మలు, వారికి బట్టలు కొనుగోలు చేస్తున్నారు.