Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్‌ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, డెన్మార్క్ నాయకులు ట్రంప్ వ్యాఖ్యలను సవాల్ చేశారు. గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్‌లో భాగమని స్పష్టం చేశారు.
Read Also: Gustavo Petro: ‘‘దమ్ముంటే మదురోలా నన్ను పట్టుకెళ్లు’’.. ట్రంప్‌కు మరో దేశాధినేత సవాల్..
ప్రపంచ భద్రతకు ఆర్కిటిక్ ప్రాంతం ముఖ్యమైందని యూరప్ నాయకులు చెప్పారు. నాటో ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిందని, గ్రీన్‌ల్యాండ్‌తో సహా డెన్మార్క్ నాటో భాగమని చెప్పారు. ఆర్కిటిక్ భద్రత, యూరప్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ, అట్లాంటిక్ స్థిరత్వానికి చాలా కీలకమని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్ సమస్యపై డెన్మార్క్‌కు యూరప్ దేశాలన్నీ సంఘీభావం ప్రకటించాయి. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ.. నాటో సభ్యుల మధ్య బెదిరింపులు, ఒత్తిడి కూటమిని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. నాటోలోని ఏ దేశం మరో దేశాన్ని బెదిరించకూడదని అన్నారు.
వెనిజులా దాడి తర్వాత, గ్రీన్‌ల్యాండ్ అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇటీవల, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భద్రతకు గ్రీన్‌ల్యాండ్ ముఖ్యమైందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్‌ల్యాండ్ అంశాన్ని పరిశీలిస్తామని చె ప్పారు. గత నెలలో ట్రంప్ లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్‌ల్యాండ్‌కు ప్రత్యేక రాయబారిగా నియమించారు. లాండ్రీ ఈ ద్వీపాన్ని అమెరికా పరిధిలోకి తీసుకురావడానికి మద్దతు ఇచ్చారు. దీని వ్యూహాత్మక స్థానం, సహజవనరులను ఆయన హైలెట్ చేశాడు. గ్రీన్‌ల్యాండ్ యూరప్, అమెరికాలకు మధ్యలో ఉంది. ఇది యూఎస్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ముఖ్యమైందని అమెరికా భావిస్తోంది. గ్రీన్‌ల్యాండ్ వ్యాప్తంగా ఖనిజవనరులు పుష్కలంగా ఉండటంతో చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని అమెరికా భావిస్తోంది.