Gustavo Petro: గత శనివారం వెనిజులాపై అమెరికా దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. మదురో డ్రగ్స్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ట్రంప్ ప్రధాన ఆరోపణ. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని యూఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్‌కు సవాల్ చేశారు. దీని తర్వాతే, అమెరికా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేసి మదురోను బంధించింది. అయితే, ఇప్పుడు మరో దేశాధినేత కూడా ట్రంప్‌ను సవాల్ చేస్తున్నాడు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సోమవారం అమెరికా ఆపరేషన్‌ను తీవ్రంగా ఖండించారు. ఒక ప్రకటనలో ‘‘ నన్ను వచ్చి పట్టుకోండి. నేను ఇక్కడే మీ కోసం వేచి ఉన్నాను’’ అని అన్నారు.
Read Also: Wipro: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. ఒక్క గంట తక్కువైనా..
“ఒకవేళ వారు [అమెరికా] బాంబులు వేస్తే, రైతులు పర్వతాలలో వేలాది మంది గెరిల్లాలగా మారతారు. మరియు దేశంలో అధిక భాగం ప్రేమించే మరియు గౌరవించే అధ్యక్షుడిని వారు నిర్బంధిస్తే, వారు ప్రజల ‘జాగ్వార్’ను విడిచినట్లే అవుతుంది’’ అని హెచ్చరించారు. 1990లలో నిరాయుధీకరణకు ముందు వామపక్ష గెరిల్లాగా ఉన్న పెట్రో మాట్లాడుతూ.. ‘‘నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని ప్రమాణం చేశాను. కానీ మాతృభూమి కోసం నేను మళ్లీ ఆయుధాలు పట్టుకుంటాను’’ అని అన్నారు.
వెనిజులా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని ఆరోపించారు. కొలంబియా బాగా నష్టపోయిందని, ఒక చెడ్డ వ్యక్తి పాలిస్తున్నాడని అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తల్ని పెంచాయి. కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందని ట్రంప్ అన్నారు. అక్టోబర్‌లో, డ్రగ్స్ వ్యాపారంలో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పెట్రో, అతడి కుటుంబంపై అమెరికా ఆంక్షలు విధించింది. కొలంబియా ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ ఉత్పత్తిదారు. కోకా మొక్కను ప్రధానంగా పెరూ, బొలీవియా, కొలంబియా పండిస్తాయి.