ఉక్రెయిన్‌పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని వివరించింది.
అయితే రష్యా ప్రజలు కండోమ్‌లను అధికంగా కొనుగోలు చేయడానికి ఓ కారణం ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో కండోమ్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం రష్యన్ ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగానే కండోమ్ విక్రయాలు ఆ దేశంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ.. డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రజలు కండోమ్‌లను భవిష్యత్ అవసరాల కోసమే కొంటున్నారని, రానున్న కాలంలో కండోమ్‌లు కొనలేని ధరకు చేరుతాయని ప్రజలు భావిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.