Ayman al-Zawahiri-Taliban: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని హతమార్చినట్లు స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించారు. 9/11 అమెరికా ట్విన్ టవర్స్ దాడులపై ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికా భావిస్తోంది. అమెరికన్లకు హాని తలపెట్టే ఏ ఒక్క ఉగ్రవాదిని ఉపక్షించబోం అని అమెరికా చెబుతోంది. ఇటీవల కాబూల్ లో ఆశ్రయం పొందుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా తన డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించి హతం చేసింది. రాజధాని కాబూల్ లోని ఓ భవనంలో నివాసం ఉంటున్న అల్ జవహరి బాల్కానీలో ఉన్న సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ అటాక్ చేసి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని లేపేసింది. 2011లో అప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్తాన్ అబోటాబాద్ లో ఆశ్రయం పొందుతున్న సమయంలో అమెరికా నేవీ సీల్స్ హతమార్చాయి. ఆ తరువాత అల్ జవహరి కోసం వేట సాగించగా.. ఆదివారం అతన్ని కూడా లేపేసింది.
ఇదిలా ఉంటే అల్ జవహరి మరణంపై యునైటెడ్ ఎమిరెట్స్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తోంది. అయితే దాడి జరిగిన ప్రాంతంలో అల్ జవహరి జాడ లేదని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ అన్నారు. అమెరికా చేసిన ప్రకటన వాస్తవికతను తెలుసుకునేందుకు తాలిబన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. డ్రోన్ దాడిపై తాలిబన్ నాయకులు కానీ.. ఇతర అధికారులు కానీ పెద్దగా నోరు విప్పింది లేదు. ఇప్పటి వరకు తాలిబన్లు అల్ జవహరి మరణాన్ని ధ్రువీకరించలేదు. యూఎస్ఏ డోన్ దాడిపై ఎలా స్పందించాలనే విషయంపై తాలిబన్లలోని మూడు వర్గాలు సుదీర్గ చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Ramdev Baba: వివాదాస్పద వ్యాఖ్యలు.. కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలు, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆప్ఘన్ తాలిబన్ ప్రభుత్వం.. యూఎస్ తో పాటు ఇతర దేశాల సాయాన్ని కోరుకుంటోంది. దీంతో పాటు తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అమెరికాతో పాటు పాశ్చత్య దేశాలు గుర్తించలేదు. మరోవైపు అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయిన తరువాత బిలియన్ డాలర్ల నిధులు స్తంభించిపోయాయి. దీంతో ఇన్ని సమస్యలతో ఉన్న తాలిబన్లు యూఎస్ఏ డ్రోన్ దాడిపై ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే యూఎస్ బలగాలు వెళ్లిపోయే సందర్భంలో.. ఆఫ్ఘన్ ఏ ఇతర ఉగ్రవాదా సంస్థకు అడ్డా ఉండకూడదనే ఒప్పందం జరిగింది. అయితే తాజాగా అల్ ఖైదా అగ్రనాయకుడిని కాబూల్ నగరంలో చంపేయడం ప్రస్తుతం తాలిబన్లకు మింగుడు పడటం లేదు. మరోవైపు అల్ జవహరికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా తాలిబన్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ అన్నారు.