Abraham Alliance: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్య తర్వాత ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. హనియే హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్‌తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇజ్రాయిల్ సైలెంట్‌గా ఉంది. అయితే, హనియే హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన మిత్రపక్షాలైన ఇరాక్, సిరియా, లెబనాన్‌లో కలిసి ఇజ్రాయిల్‌పై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్‌పై దాడికి ఆదేశించినట్లు సమచారం.
Read Also: Paris Olympics 2024: సెమీస్లోకి భారత హాకీ మ్యాచ్.. పెనాల్టీ గోల్లో విజయం
ఈ నేపథ్యం దాడి ఎప్పుడైనా జరగొచ్చని ఇజ్రాయిల్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ దాడిని ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్‌తో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ శుక్రవారం ఓ ప్రకటనలో తన అమెరికా, బ్రిటన్ సహచరులు లాయిడ్ ఆస్టిన్, జాన్ హీలీతో మాట్లాడానని చెప్పారు. ఈసారి ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇజ్రాయిల్ అమెరికా, యూకేలతో ‘‘అబ్రహం కూటమి’’ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
మరోవైపు ఇరాన్ దాడి చేస్తే అమెరికా, ఇజ్రాయిల్‌కి అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇప్పటికే ఇజ్రాయిల్‌కి అండగా యుద్ధనౌకలతో సహా పలు రక్షణ సామాగ్రిని మోహరించింది. ‘‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’ పిలువడే ఇరాన్ ప్రాక్సీ కూటమిని ఎదుర్కొనేందుకు ‘‘అబ్రహం కూటమి’’ ఏర్పాటును ఇజ్రాయిల్ ఆశిస్తోంది.యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో ఇరాన్ ప్రాక్సీలైన లెబనాన్‌లో హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఉన్నారు.