కశ్మీర్‌లో పత్రిక స్వేచ్ఛ లేదంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. భారత్‌పై అబద్దాలను ప్రచారం చేస్తోందని అంటూ మండిపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ కల్పితాలు, కట్టుకథలను భారతీయులు అనుమతించబోరని ఆయన స్పష్టం చేశారు. భారత్ విషయంలో ఆ పత్రిక తటస్థ వైఖరిని ఎప్పుడో వదిలేసిందన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ ఇతర ప్రాథమిక హక్కుల మాదిరిగా పవిత్రమైందని చెప్పారు. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన అభిప్రాయం పూర్తిగా కల్పితమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Also Read: Women Reservations Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తాం: సీతారాం ఏచూరి
నేడు యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని, కానీ సదరు పత్రికకు కన్పించక పోవడం విడ్డూరంగా ఉందని అనుగాగ్ ఠాకూర్ అన్నారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నాయకత్వంలో స్పూర్తి దాయకమైన దేశంగా ముందుకు వెళుతోందన్నారు. భారతదేశంపై పగ పెంచుకుంటున్న కొన్ని విదేశీ మీడియా సంస్థలు.. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజాస్వామ్యం, బహుళత్వ సమాజం గురించి చాలా కాలం నుంచి అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కేంద్ర మంత్రి ఆరోపించారు.