Anti-Hijab protests In Iran- Mahsa amini Death: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని ఇరాన్ లోని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి మరణించింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన దాడుల్లో 30కి పైగా మంది మరణించారు.
ఇదిలా ఉంటే వారం రోజులుగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించే వారు శుక్రవారం దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్ లో హిజాబ్, ప్రభుత్వానికి మద్దతుగా వేల మంది ప్రభుత్వ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇరాన్ జెండాలను చేతిలో పట్టుకుని.. నగరవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ఇలా హిజాబ్ కు వ్యతిరేకంగా.. హిజాబ్ కు మద్దతుగా ఇరు పక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
Read Also: Flight on Road: గాల్లో విమానం రోడ్డుమీదకు.. ఏంటా కథ?
అమెరికా, ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు జరిగాయి. విదేశాలు, ఇరాన్ లో అశాంతికి కారణం అవుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. 2019 తరువాత ఇప్పుడే ఇరాన్ లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో వందల మంది చనిపోయారని పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ఇంటర్నెట్ పై తీవ్ర ఆంక్షలను పెట్టారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిపై నిషేధం విధించారు.
ఒక్క మహిళ మరణం ఇరాన్ లో మతఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాటాలను ప్రోత్సహించింది. 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఇరాన్ మారిన తర్వాత అప్పటి నుంచి అక్కడ కఠిన చట్టాలు అమలు అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి. అయితే గత వారం టెహ్రాన్ లో పర్యటిస్తున్న మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత గత శుక్రవారం మహ్సా అమిని మరణించడంతో దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభం అయింది.