Sri Sri Ravi Shankar: శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్‌కు అరుదైన గౌరవం లభించింది. అమెరికా, కెనడాల్లోని 30 నగరాల్లో ఆయన పేరుతో దినోత్సవం నిర్వహించనున్నారు. అమెరికాలోని హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించాయి. యుద్ధ విధ్వంస ప్రాంతాల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని టెక్సాస్ గవర్నర్ ప్రశంసించారు. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30 నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ కావడం విశేషం. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్‌కు మరొక అరుదైన గౌరవం లభించింది. శ్రీశ్రీ రవిశంకర్ గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడాలోని నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకరే కావడం విశేషం.
Read also: Heart Attack: విదేశాలకు వెళ్లిన యువతలో గుండెపోటు కేసులు.. కారణమేంటీ..?
ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచం నలుమూలలా.. శాంతి, సమగ్రతను వ్యాపింపజేయడమే కాకుండా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురూజీ. భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కిందని ఆ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచానికి గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుందని పేర్కొన్నారు. ‘తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ శ్రీశ్రీ, వారి అనుచరులు.. ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి, కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు. ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు’ అని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇచ్చిన ప్రశంసా పత్రంలో శ్రీశ్రీ రవిశంకర్‌ను ప్రశంసించారు.
Read also: Gujarat CM Bupendra Ptel: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించింది. ఆధ్యాత్మికత, సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్‌హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించి నిర్వహించాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత నేషనల్ మాల్‌లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.