Gujarat CM Bupendra Ptel: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుందనే విషయంపై తమ ప్రభుత్వం అధ్యయనం జరపాలనుకుంటోంది. అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? అనే కోణంలో పరిశీలించాకే ముందుకెళ్లాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించారాయన. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి డిమాండ్‌లు వినిపిస్తున్నాయని ఆదివారం మెహసనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారాయన. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయంలో సలహా ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని కోరారు. వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాలు రూపకల్పన చేయాలని సూచించారు అని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. రాజ్యాంగం గనుక అందుకు అనుమతిస్తే.. అధ్యయనం కొనసాగించి మంచి ఫలితం సాధిస్తాం అని తెలిపారాయన.
Read also: TSRTC: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నిర్ణయం హర్షదాయకం
ఈ విషయంలో ఓ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అలాంటి చట్టమేదైనా తెస్తే.. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటూ తనతో అన్నారని సీఎం భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖేదావాలా. ‘‘ప్రమే వివాహాల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అసెంబ్లీలో చట్టం లాంటిది తెస్తే.. దానికి నా మద్దతు ఉంటుంది’’ అని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ 2021(సవరణ) ప్రకారం వివాహం వంకతో బలవంతంగా మతం మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. దోషిగా తేలితే పదేళ్ల దాకా శిక్ష పడుతుంది. అయితే గుజరాత్ హైకోర్టు ఈ చట్టంపై స్టే విధించగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.