Rupee: డాలర్ విలువతో పోటీ పడలేని ఇండియా రూపాయి మరోసారి పడిపోయింది. డాలర్ బలపడితే ఇండియా రూపాయి పడిపోతుంది.. డాలర్ బలహీనపడితే ఇండియా రూపాయి విలువ పెరుగుతుంది. ఇది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. ఎక్కువ శాతం రూపాయి విలువ తగ్గుతూనే వస్తుంటుంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో రూపాయి విలువ 19 పైసలు తగ్గింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ తగ్గడంతోపాటు.. యూఎస్ డాలరు బలపడిన నేపథ్యంలో భారత కరెన్సీ(రూపాయి) విలువ 19 పైసలు నష్టపోయి.. 82.82 వద్ద స్థిరపడింది. గురువారం డాలరు మారకంలో 19 పైసలు కోలుకున్న రూపాయి తాజాగా రెండంకెల స్థాయిలో నష్టాన్ని చవిచూసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 82.75 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 82.87 స్థాయికి తగ్గిపోయింది.
Read also: NTR PK: టైగర్ vs OG… ముందెన్నడూ చూడని బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో రిస్క్ సాధానాలకు ఇన్వెస్టర్లు దూరం జరుగుతున్నందున సమీప భవిష్యత్తులో రూపాయి మారకం 83 స్థాయికి తగ్గవచ్చని ఫారెక్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై నెలలో యూఎస్ ద్రవ్యోల్బణం నెమ్మదించినందున డాలర్ బలపడుతోందని.. రానున్న రోజుల్లో నెగిటివ్‌గానే రూపాయి ట్రేడవుతుందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 82.40 నుంచి 83.30 మధ్య రూపాయి హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. డాలర్ ఇండెక్స్ 0.15 శాతం మేర పెరిగి 102.7 స్థాయికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర ప్రస్తుతం 87 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అయితే దేశంలో విదేశీ మారకం నిల్వలు అంతకంతకూ పడిపోతున్నాయి. వరుసగా మూడో వారంలోనూ విదేశీ మారకం నిల్వల్లో క్షీణత నమోదైంది. ఈ నెల 4తో ముగిసిన వారంలో మరో 2.417 బిలియన్ డాలర్లు దిగజారి 601.453 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వులు పరిమితమైయ్యాయి. ఇదే విషయాన్ని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. గత వారంలో 3.165 బిలియన్ డాలర్లు పతనమైయ్యాయి. దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో ఎక్కువ భాగమైన ఫారిన్ కరెన్సీ ఆస్తులు ఈసారి 1.937 బిలియన్ డాలర్లు తగ్గి 533.40 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.