A China Billionaire Selling Meat In Streets To Pay Off 52cr Debts: నిన్నటిదాకా అతడొక బిలియనీర్.. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాడు.. తాను స్టార్ట్ చేసిన బిజినెస్‌లో కోట్లకు పడగలెత్తి, తనదంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు. కానీ, అతను చేసిన ఒక తప్పు అతడ్ని రోడ్డుకి లాగింది. ఎంతో సంపాదించాడో, అంతకుమించిన అప్పుల్లో కూరుకుపోయేలా చేసి.. రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే స్థాయికి దిగజార్చింది. మాంసం అమ్ముకుంటూ.. సాధారణ జీవితం గడిపేలా చేసింది. పదండి.. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!
అతని పేరు తాంగ్‌జియన్(52). రెస్టారెంట్ల వ్యాపారంలో అడుగుపెట్టిన ఆయన.. అందులో తిరుగులేని సక్సెస్ సాధించాడు. కోట్లకు పడగలెత్తి.. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించాడు. 36 ఏళ్ల వయసుకే కోట్ల రూపాయల వ్యాపారాన్ని వృద్ధి చేసి, తనదైన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు.. 2005లో ల్యాండ్‌స్కేప్ ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇదే ఆయన కొంపముంచింది. ఎప్పుడైతే ఆ రంగంలోకి అడుగుపెట్టాడో.. అప్పట్నుంచి ఆయనకు కష్టకాలం మొదలైంది. లాభాలు వస్తాయని నమ్మి.. ఆ వెంచర్‌లో పెట్టుబడి పెట్టిన ప్రతీసారి ఆయనకు భారీ నష్టాలు తప్పలేదు. దాంతో ఆయన అప్పుల్లో కూరుకుపోయాడు.
ఆ అప్పులు తీర్చేందుకు.. తాంగ్‌జియన్ తన రెస్టారంట్లు, ఇళ్లు, కార్లు అమ్మేశాడు. అయినా సరే.. ఇంకా రూ.52 కోట్లు అప్పు మిగిలిపోయింది. ఆ అప్పు తీర్చేందుకు అతను ఒక చిరు వ్యాపారం మొదలుపెట్టాడు. మాంసంతో తయారు చేసిన ఆహారపదార్థాలను అమ్మడం స్టార్ట్ చేశాడు. హాంగ్‌ఝౌలోని ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కోటీశ్వరుడి నుంచి వీధి వ్యాపారిగా మారిన పరిస్థితిపై అతడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారని, ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తారని అన్నాడు. అయితే.. ఓటమిని అంగీకరించకూడదనే స్ఫూర్తి కలిగి ఉండాలని హితవు పలికాడు. ప్రస్తుతం తాంగ్‌జియన్ లైఫ్ స్టోరీ చైనాలో ట్రెండ్ అవుతోంది.